బిగ్ షాక్ టు జగన్ - నిమ్మగడ్డ తొలగింపు కుదరదు 

August 13, 2020

హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తింటున్న ఆంధ్రప్రదేశ్‌  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు మరో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు వచ్చిన కేసుల్లో ఇదే పెద్ద సంచలనం. ఎంతటి మెజారిటీ ఉన్నా రాజ్యాంగం మీరడానికి వీల్లేదని జగన్ అర్థమయ్యేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 

వివాదాస్పద రీతిలో ఇష్టానుసారంగా పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్‌ తొలగింపు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రమేష్ కుమార్ ను తొలగించడం కోసమే సృష్టించిన కొత్త ఆర్డినెన్సు, సంబంధిత జీవోలను హైకోర్టు కొట్టి వేసింది. అవన్నీ చెల్లవని పేర్కొంది. వెంటనే రమేష్ కుమార్ ను తిరిగి నియమించాలని ఆదేశించింది.

రమేష్ కుమార్‌ను తప్పించడం కోసం.. ఇచ్చిన ఆర్డినెన్స్ తెచ్చే అధికారం, అవకాశం ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే రమేశ్‌ కుమార్‌ను తిరిగి కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చారన్న రమేష్ కుమార్ వాదనల్లో నిజం ఉందని కోర్టు నమ్మింది. దానికి తగిన సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌, సంబంధిత జీవోలపై దాఖలైన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం విచారించి ఈ సంలచన తీర్పు వెలువరించింది.

కరోనా నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం జగన్ కి ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల కమిషనర్ తనకున్న అధికారాలను జగన్ కు చెప్పకుండా అమలుచేయడంతో తీవ్రంగా ఆగ్రహించిన జగన్ నిమ్మగడ్డ కమ్మోడు, చంద్రబాబు కమ్మోడు... ఇద్దరు కలిసి ఇలా చేశారు అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులారోపణలు చేశారు. వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి రమేష్ కుమార్ ను తొలగించి ఎక్కడినుంచో తెచ్చిన కనగరాజ్ ను నియమించారు.  జగన్‌తో పాటు పలువురు వైకాపా నాయకులు రమేష్ కుమార్‌ను తీవ్ర స్థాయిలో బూతులతో విమర్శించారు. 

దీంతో తనపై వేటు పడ్డ వెంటనే రమేష్ కుమార్ హై కోర్టు గడప తొక్కారు. ఇది దురుద్దేశపూర్వక చర్య అని కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.

నిమ్మగడ్డ రమేష్ స్పందన ఏంటి?

హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చాను. నిష్పక్షపాతంగా పనిచేస్తాను. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకరం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలి. వ్యక్తులు శాశ్వతంగా ఉండరు. రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తా. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నాను అని నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ అన్నారు.