బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ - వైసీపీ సంబరం

August 15, 2020

ఏపీలో మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కొద్ది నెలలుగా హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం...నుంచి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడం వరకు హైడ్రామా నడిచింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణలు జరుగుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా, మీడియాలో వైరల్ అవుతోంది. 

బీజేపీ నేతలు కామినేని శ్రీనివాసరావు, సుజనాచౌదరిలతో నిమ్మగడ్డ భేటీ హైదరాబాదులో బేటీ అవ్వడం కలకలం రేపుతోంది. జూన్ 13న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరు ముగ్గురి భేటీకి సంబంధించిన వీడియో ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

హయత్ హాటల్ పబ్లిక్ ప్లేస్. అక్కడ ఎవరైనా వెళ్లొచ్చు. పెద్ద పెద్ద వాళ్లందరూ అక్కడే భేటీలు అవుతుంటారు. బీజేపీ తరఫున నిమ్మగడ్డ వ్యవహారంలో పిల్ వేసిన కామినేనితో నిమ్మగడ్డను సుజనా చౌదరితో పాటు కలవడంపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇందులో పెద్ద వింత ఏమీ లేకపోయినా... దీనిని రాజకీయంగా వాడుకోవానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది.

జూన్ 13వ తేది  ఆ ముగ్గురూ గంటకు పైగా మంతనాలు జరిపారని తెలుస్తోంది. బీజేపీ నేతలిద్దరూ...నిమ్మగడ్డతో ఎందుకు భేటీ అయ్యారని...వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానని చెబుతోన్న నిమ్మగడ్డ...ఈ వ్యవహారంలో పిల్ వేసిన కామినేనితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. రమేష్‌కుమార్‌కు రాజకీయనేతలతో మంతనాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

బీజేపీ పెద్దల అనుమతితోనే పిల్ వేశాను అని గతంలో కామినేని బహిరంగంగా చెప్పారు.  అది పార్టీ స్టాండ్ అని కూడా తేల్చారు. ఇది పబ్లిక్ ప్లేస్ లో జరిగిన ఒక సాధారణ భేటీ. ఇందులో రహస్యం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సీసీ ఫుటేజ్ అవసరం లేదు. హయత్ లాబీల్లో ఉన్న వారికి ఎవరికైనా వీరు కనిపించే ఉంటారు. కానీ... తాను నిండా మునిగిన ఈ కేసులో నిమ్మగడ్డను బదనాం చేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా ఈ వీడియోలను వాడుకుంటోంది.

కాగా... వీరు హేటీ అయిన హయత్ హోటల్ ఒక రెడ్డి వర్గానికి చెందిన సుబ్బిరామిరెడ్డిది అన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.