ఏపీలో జగన్ ఫ్యాక్షన్ పాలనకు నిమ్మగడ్డ లేఖే సాక్ష్యం

June 03, 2020

నవ్యాంధ్రలో మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మంచి పాలననే అందిస్తారని అంతా నమ్మారు. అయితే ఐదేళ్ల తన పాలనలో ఏడాది కూడా గడవకముందే... తన పాలన ఏ రీతిన ఉంటుంలో జగన్ చెప్పకనే చెప్పేశారు. తాత వైఎస్ రాజారెడ్డి ఫ్యాక్షన్ లక్షణాలను పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపించే జగన్... అంందుకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తారు? నిజమే... తండ్రి అందించిన రాజన్న రాజ్యం పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన జగన్... తాత నడిపిన ఫ్యాక్షన్ పాలననే సాగిస్తున్నారు. మున్ముందు కూడా ఇదే తరహా పాలనను మరింత భయంకరంగా జగన్ సాగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు నిజంగానే భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. జగన్ మార్కు పాలనకు నిలువెత్తు నిదర్శనంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ నిలుస్తోంది.

కేంద్రం స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి పని చేస్తుందో... రాష్ట్రం పరిధిలో రాష్ట్ర ఎన్నికల సంఘం అదే తరహా పని చేస్తుంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో... రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అయితే జగన్ రాక్షస పాలనను అనుభవించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... తన పరిస్థితి ఏమిటో? ప్రస్తుతం రాష్ట్రంలో అధికారులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో? అసలు రాజ్యాంగబద్ధ సంస్థలు, ఆ సంస్థల అధిపతులకు జగన్ సర్కారు ఇస్తున్న విలువ ఏమిటో?, ఆయా సంస్థలు, సంస్థల అధిపతులకు జగన్ సర్కారు నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉన్నదో? సవివరంగా వివరిస్తూ ఏకంగా ఐదు పేజీల లేఖను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు రాశారు. 

బుధవారం రమేశ్ కుమార్ రాసిన ఈ లేఖలో ఆయన చాలా కీలకమైన, సంచలనాత్మకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపించడం లేదని, ఫ్యాక్షన్ కక్షలతో బుసలు కొడుతున్న సర్కారు తనదైన శైలి పాలనతో అధికార యంత్రాంగాన్ని ఏ రీతిన భయభ్రంతులకు గురి చేస్తున్నదో సోదాహరణంగా తెలుపుతూ సదరు లేఖలో నిమ్మగడ్డ సంచలన విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం లేదన్న విషయాన్ని ఇప్పటికే చాలా మంది అధికారులకు అర్థమైపోయిందన్న అర్థం వచ్చేలా కూడా నిమ్మగడ్డ తన లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర పోలీసుల నుంచి అధికారులకు రక్షణ కరువైందన్న విషయాన్ని కూడా నిమ్మగడ్డ ప్రస్తావించారు. 

ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించిన నిమ్మగడ్డ... ఏపీలో కూర్చుని పనిచేసేందుకు తనకు ధైర్యం చాలడం లేదని కేంద్రానికి మొరపెట్టుకున్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా తన విద్యుక్త ధర్మాలను తూచా తప్పకుంటా పాటిస్తూ పనిచేయాలంటే తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని నిమ్మగడ్డ కోరారు. అంతేకాకుండా కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించినా... అమరావతిలో కూర్చుని తాను పనిచేయలేనని, హైదరాబాద్ లో ఉంటూ పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కూడా నిమ్మగడ్డ తన లేఖలో కేంద్రాన్ని అభ్యర్థించారు. తనపై స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ విప్ లు... చివరకు స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించిన నిమ్మగడ్డ... ఈ తరహా వాతావరణాన్ని ఫ్యాక్షనిజమనక ఇంకేమనాలని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా జగన్ మార్కు పాలన ఎలా ఉందన్న విషయాన్ని సోదాహరణలతో చెప్పేసిన నిమ్మగడ్డ... జగన్ పాలనను ఫ్యాక్షన్ పాలన అనే అంటారన్న విషయాన్ని కూడా పక్కా ఆధారాలతో నిరూపించినట్టైందన్న వాదన వినిపిస్తోంది.