ఉరి తప్పించుకునేందుకు నిర్భయ దోషి ముష్టి ప్లాన్

August 06, 2020

దారుణమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేయటం తెలిసిందే. ఈ తీర్పులో ఒక మెలిక పెట్టారు. నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తీర్పునిచ్చింది. అంటే.. నలుగురిలో ఏ ఒక్కరికి ఉరి తీసే అవకాశం లేకపోతే.. మిగిలిన ముగ్గురికి వేయాల్సిన ఉరిని వాయిదా వేయాల్సి వస్తుంది. కోర్టు ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు నిర్భయ దోషులు.
తాము చేసిన వెధవ పనికి బాధను వ్యక్తం చేయని నిర్భయ దోషులు.. కోర్టు ఫైనల్ చేసిన ఉరి నుంచి తప్పించుకునేందుకు ఈ నలుగురు దోషులు ఒక్కోసారి ఒక్కోలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి బలం చేకూరేలా వారి తీరు ఉందని చెప్పాలి. ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరటం.. దాన్ని రాష్ట్రపతి రిజెక్టు చేసిన తర్వాత పదిహేను రోజుల వరకూ ఉరిశిక్ష అమలు చేసే వీలు లేని నేపథ్యంలో.. ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెబుతున్నారు.
ఉరిశిక్ష అమలు కాకుండా ఉండేందుకు నలుగురిలో ఒకరు ఏదో ఒక పిటిషన్ వేయటం.. కోర్టు విచారణకు రావటం.. వాదనలు జరుగుతుండటంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా మార్చి మొదటివారంలో ఉరిశిక్షను అమలు చేయాలని..నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయాలన్న మాట సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో.. ఇక ఉరి పడటం ఖాయమని భావించారు.
ఇలాంటివేళ..అనూహ్యంగా నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ ఊహించని పని చేశాడు. జైల్లోని గోడకు తన తలను బాదేసుకోవటంతో గాయాలు అయ్యాయి. ఒత్తిడితో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇదేమీ ఒత్తిడి కాదని.. పక్కా ప్లా్న్ తోనే ఇలాంటివి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఉరిశిక్షను అమలు చేయాల్సి వస్తే.. నలుగురు దోషులకు ఒకేసారి వేయాలి. అంత విస్పష్టంగా ఉన్న కేసు తీర్పుకు తాజా పరిణాణం చోటు చేసుకుందా? అని అనుమానిస్తున్నారు.
జైల్లో ఉన్న నలుగురు నిర్భయ దోషుల్లో ఏ ఒక్కరు గాయపడిన.. మిగిలిన ముగ్గురికి కోర్టు విధించిన ఉరిశిక్ష అమలునువాయిదా వేస్తారు. దీన్నో సాకుగా తీసుకొని.. ఒకరి తర్వాత ఒకరుఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేసే వీలుందంటున్నారు. అదే జరిగితే తమకు అండగా ఉందన్నట్లుగా చట్టాన్ని నిర్భయ దోషులు వాడేస్తారని చెప్పక తప్పదు.