బడ్జెట్ పెట్టింది తెలుగింటి కోడలు- అయినా అన్యాయమే

July 07, 2020

పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి పశ్చిమబెంగాల్ కు మేలు జరుగుతుంది
తమిళనాడు ఆర్థిక మంత్రి ఉంటే తమిళనాడుకు మేలు జరుగుతుంది
ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి ఉంటే ఉత్తరప్రదేశ్ కి మేలు జరుగుతుంది
తెలుగింటి కోడలు ఆర్థిక మంత్రి అయినా ఏపీ కి వచ్చిందేమీ లేదు.

ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపులు చాలా ఉన్నాయి. విభజన హామీల్లో చట్టబద్ధం అయిన హామీలకు ఇంకా 80 శాతం డబ్బులు రావాలి, పోలవరానికి 60 శాతం డబ్బులు రావాలి. కానీ కేంద్ర బడ్జెట్లో వాటి ఊసే లేదు. ఒక వైపు ఏపీలో ఎదగాలనుకుంటున్నాం అని బీజేపీ చెప్పినా బీజేపీ ప్రభుత్వం ఏపీకి హ్యాండిచ్చింది. అనేక రాష్ట్రాలకు చెప్పనవి కూడా ఇస్తున్న మోడీ ఏపికి మాత్రం చట్టంలో ఉన్న హక్కులు కూడా నెరవేర్చడం లేదు.
మొన్నటి వరకు చంద్రబాబు మీద నెపం వేశారు. ఇపుడు చంద్రబాబు అధికారంలో కూడా లేదు. మరి ఇపుడు ఎందుకు కేటాయింపులు రాలేదు.ఏపీకి ఈ బడ్జెట్లో కేటాయింపులు తగినంత చేయమని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు లేఖ రాయలేదు. ఈ బడ్జెట్ అనంతరం తెలుగు వాళ్లు తీవ్రంగా డిజప్పాయింట్ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి... ఏపీకి జరిగిన అన్యాయంపై నోరు కూడా విప్పలేదు. గత నెల రోజుల నుంచి బడ్జెట్ డేట్లు తెలుసు. మనకు డబ్బులు రావల్సినవి ఉన్నాయి. అయినా ప్రధాన మంత్రికి జగన్ లేఖ కూడా రాయలేదు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయమని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కోరలేదు.
ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వారందరూ ఎంతో కొంత తమ రాష్ట్రానికి కేటాయింపులు జరిగేలా చూసుకున్నారు. కానీ నిర్మల సీతారామన్ తెలుగు కోడలు అయ్యిుండి ఏపీకి ఏ కేటాయింపులు చేయలేకపోయారు. మోడీ క‌నుస‌న్నల్లో ఉంటార‌న్న ఆలోచ‌న‌తోనే నిర్మ‌ల‌మ్మ‌కు ఆర్థిక‌మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టార‌న్న ప్ర‌చారం నిజమని తేలిపోయింది. మోడీ చెబితే సొంత రాష్ట్రానికి కూడా అన్యాయం చేయడానికి ఆమె వెనుకాడలేదు. ఈ తప్పు ఆమెను భవిష్యత్తులో వెంటాడుతూనే ఉంటుంది.