అలవిమాలిన అలసత్వం

August 12, 2020

కరోనా కట్టడి చర్యలకు అడ్డొస్తున్న అహం
వైరస్‌ను తేలిగ్గా తీసేసిన సీఎం
ఈ వైరస్‌కు పారసిటిమల్‌ చాలని ధీమా
బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని సూచన
విద్యార్థులకు సెలవులిచ్చేందుకూ
తొలుత తిరస్కరణ
క్రమేపీ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు
అయినా లాక్‌డౌన్‌ పొడిగింపునకు ససేమిరా
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల క్షేమం ఏమైనా పడుతోందా..? కేంద్రం ఆదేశిస్తే తప్ప తనంత తాను నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేదు. ‘యథా రాజా.. తథా అధికార గణం’ అన్న మాట రాష్ట్ర ఉన్నతాధికారులకు సరిపోతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరిపాకే స్థానిక ఎన్నికలను వాయిదావేశారని తెలిసినా సీఎంకు భయపడి బయటకు చెప్పలేని పరిస్థితి మన ఉన్నతాధికారులది. కరోనా తీవ్రత గురించి వారికి ముందే తెలిసినా.. ఆ మాట చెబితే జగన్‌ మండిపడతారని కిమ్మనకుండా కూర్చున్నారు. సీఎంకే చిత్తశుద్ధి, అవగాహన లేనప్పుడు మనకెందుకని కూర్చున్నారు. ఈ వైరస్‌పై ‘ప్యానిక్‌’ (భయాందోళనలు) బటన నొక్కాల్సిన అవసరం లేదని.. దానికి పారసిటిమల్‌ మాత్ర వేసుకున్నా సరిపోతుందని.. ఇంట్లో ఉంటూనే వైద్యం చేయించుకోవచ్చని.. కాల్వల వెంబడి బ్లీచింగ్‌పౌడర్‌ చల్లితే చాలని చెప్పిన సీఎం బహుశా జగన్‌ ఒక్కరేనేమో! అధినేత తీరే ఇలా ఉంటే.. ఆయన్ను గుడ్డిగా అనుసరించే అధికారులు ఏదో చేస్తారని ఆశించడం ప్రజల పొరపాటే అవుతుంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రోజూ వేల మంది నేలకొరుగుతున్నారు. దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోనూ కరోనా మరణాలు తీవ్రమవుతున్నాయి. మన రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నియంత్రణలు సరిగా పాటించక.. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. అయినా అధికార యంత్రాంగంలో నిర్లిప్తత కనిపిస్తోంది. కరోనా విపత్తు ముంచుకొస్తోంది.. జాగ్రత్త పడండి.. తక్షణ చర్యలు తీసుకోండని కేంద్రం ఆదేశించిన ఆరు రోజులకు గానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మనుషుల ప్రాణాలను హరిస్తోన్న కరోనా(కోవిడ్‌-19)ను బయోలాజికల్‌ డిజాస్టర్‌ (జీవ విపత్తు)జాబితాలో చేరుస్తూ, రాష్ట్ర విపత్తు స్పందన (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) నిఽధులతో వ్యాధి నిరోధం, నియంత్రణ, నివారణకు చర్యలు తీసుకోవాలని గత నెల 19న ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని, స్థానిక ఎన్నికలు  నిర్వహించేలా కమిషనర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించడం.. కరోనా చర్యలే కీలకమని, ఎన్నికలు ఇప్పుడు వద్దని ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించినా ప్రభుత్వం కళ్లు తెరవలేదు.
యంత్రాంగం వైఫల్యం..
కరోనా ద్వారా ఎదురయ్యే ముప్పును అంచనా వేయలేడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఆదేశాలపైనా అందుకే వెంటనే స్పందించలేదు. వాస్తవానికి విపత్తు ప్రకటనపై ఫైల్‌ ఎప్పుడో తయారైంది. సీఎం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో అనుమతి కోసం ఎదురుచూస్తూ సీఎస్‌ పేషీలో పెండింగ్‌లో పెట్టారు. చివరకు మార్చి 20న కరోనా కట్టడి చర్యలపై ప్రధాని మోదీ రాషా్ట్రల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారని తెలిశాక అధికారులు కళ్లు తెరిచారు. తీవ్రతను సీఎం కార్యాలయానికి విశదీకరించి ఉత్తర్వులు జారీచేశారు. నిజానికి కరోనా నివారణకు సకల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా.. అందుకు కలెక్టర్ల వద్ద నిధుల్లేవు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవచ్చో లేదో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో కలెక్టర్లు నిధుల సమీకరణ బాధ్యతను మండలస్థాయిలో తహశీల్దార్ల నెత్తిపై పెట్టారు. వాళ్లు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు? ఆ తర్వాత ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోవాలని ఆదేశించినా.. ఏప్రిల్‌ 2 వరకు కలెక్టర్లు పైసా విడుదల చేయలేదు. అదే రోజు ప్రధాని మళ్లీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుండగానే.. నిధులు మంజూరుచేశారు. ఇక మాస్కులు, పీపీఈలు, వైద్యులకు రక్షణ పరికరాలు పెద్దగా అందుబాటులో లేవు. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గుంపులుగుంపులుగా తిరిగితే వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయంతో పలు రాష్ట్రాల్లో వాటన్నిటికీ సెలవులు ప్రకటించేశారు. ఆంధ్రలో మాత్రం సీఎం జగన్‌ తొలుత ఇందుకు ససేమిరా అన్నారు. విద్యాశాఖపై ఉన్నతాధికారుల సమీక్షలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘నో.. నో! అది కుదరదు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ఇప్పుడు... కరోనా కట్టడి పేరిట సెలవులిస్తే వేరే సంకేతాలు వెళ్తాయి’ అని ఓ ఉన్నతాధికారి అందరి నోళ్లు మూయించారు! పురపాలక అధికారులు కూడా సమావేశమై కరోనాపై చర్చించినప్పుడు.. ‘ఈ వైరస్‌ ముప్పు నగరాలు, పట్టణాలకే ఎక్కువగా ఉంది. దీని కట్టడికి ఏం చేయాలో కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. మన రాష్ట్రంలో కూడా భారీ స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరముంది’ అని కొందరు అధికారులు సూచించారు. ‘అమ్మో... ఇంకేమైనా ఉందా! రాష్ట్రంలో కరోనా కట్టడిలోనే ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు భిన్నంగా మనం హడావుడి చేస్తే ఎలా’ అని అక్కడే ఉన్న ఓ ఉన్నతాధికారి వారందరినీ ‘కట్టడి’ చేసేశారు. ప్రపంచమంతా అంగీకరించిన కరోనా తీవ్రతను అంగీకరించేందుకు జగన్‌ ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోంది. కరోనా ప్రభావం లేదని ఎన్నికల వాయిదాను వ్యతిరేకించామని.. ఇప్పుడు దాని తీవ్రతను అంగీకరిస్తే తమపై విమర్శలు వస్తాయన్నది పెద్దల భయం.
తబ్లీగీలపై దాగుడుమూతలు
ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాతకు దేశంలోని వివిధ రాష్ట్రాల ముస్లింలు హాజరై తిరిగొచ్చారు. వారిలో 60 శాతానికిపైగా కరోనా లక్షణాలున్నాయని కేంద్రం ముందుగానే హెచ్చరించింది. కానీ మన రాష్ట్రంలో ఈ నెల ఏడో తేదీ వరకు చిత్తశుద్ధితో వారి కోసం అన్వేషించిన పాపాన పోలేదు. వలంటీర్లు తెగబడి తిరుగుతున్నారని.. వారిని పట్టేస్తున్నారంటూ సీఎం, ఉన్నతాధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో తబ్లీగీలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వారితో కాంటాక్టు అయినవారికి కరోనా లక్షణాలు బయటపడిన తర్వాత గానీ ప్రభుత్వం కళ్లు తెరవలేదు.
మూడో దశలోకి వచ్చేశాం..
రాష్ట్రంలో కరోనా వైరస్‌ మూడో దశకు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రకటించారు. వైరస్‌ కట్టడికి  సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎంటీ కృష్ణబాబు సారథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కూడా వేశారు. అంటే సమస్య తీవ్రమైందన్న మాటే కదా! మరి నిజానిజాలు తెలుసుకోకుండా ఎన్నికల కమిషనర్‌పై ఎందుకు దుమ్మెత్తిపోశారు? కరోనాను చాలా దేశాలు తక్కువ అంచనా వేశాయి. ‘మనకు కరోనా భయం లేదు’ అని ఇరాన్‌ మంత్రి ఒకరు పార్లమెంటులో ప్రకటించారు. ఆ తర్వాత ఆయనే కరోనా బారిన పడ్డారు. మన పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ‘పారసిటమల్‌’ మాట ఎత్తినప్పటికీ, ముందు జాగ్రత్తల విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. ఎందుకంటే, దేశ విదేశాల నుంచి వచ్చే వారికి హైదరాబాద్‌ ఒక కేంద్రం. వైరస్‌ విస్తరణ ప్రమాదం ఎక్కువ. అందుకే, అక్కడ విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. జిమ్‌లు, పబ్బులు మూసివేశారు. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మన రాష్ట్రంలో ఇలా...
‘కరోనాపై ఇంతగా భయపడాలా? ఇదంతా అతి’ అనే ప్రశ్నలూ కొందరి నుంచి వినిపిస్తున్నాయి. కానీ... అప్రమత్తంగా ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెబుతోంది. వైరస్‌ సోకిన, సోకినట్లు అనుమానాలున్న వారికి చికిత్స చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. కానీ... నియంత్రణ దిశగా అడుగులు పడడంలేదు. ఎక్కువ మంది గుమికూడే చోటే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదముంది. అలా జరగకుండా ఉండాలంటే.. విద్యా సంస్థలకు, సామూహికంగా పాల్గొనే కార్యక్రమాలకు ‘సెలవులు’ ఇవ్వాలని అధికారులు, వైద్య నిపుణులు పదే పదే పోరడంతో ఎట్టకేలకు సెలవులిచ్చారు. ఇంతచేసినా పాజిటివ్‌ కేసులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. కానీ ఎక్కువ నాళ్లు లాక్‌డౌన్‌ అమలు చేయడం సీఎంకు ఇష్టం లేదని సాక్షాత్తూ విజయసాయిరెడ్డే ప్రకటించారు. దీనినిబట్టే ఆంక్షలు ఎంత బాగా అమలవుతున్నాయో అర్థమవుతోంది. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఆర్భాటంగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వైరస్‌ నియంత్రణ చర్యలకు రూపాయి కూడా విడుదల చేయడం లేదు. చివరకు కరోనా అనుమానితుల నుంచి నమూనాలు తీసి, ల్యాబ్‌కు పంపించడానికి కూడా ఆరోగ్యశాఖ ఇబ్బందులు పడుతోంది. నిధులు ఇస్తేగానీ శాంపిళ్లు ల్యాబ్‌కు తరలించలేమని ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల సిబ్బంది స్పష్టంగా చెబుతున్నారు. దీంతో చేసేది లేక అధికారులు అందుబాటులో ఉన్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులు ఉపయోగిస్తున్నారు. అవీ లేకపోతే ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చేది. ప్రజారోగ్యానికి పూచికపుల్ల విలువివ్వని నేతలు పాలకులు కావడం దురదృష్టకరమని నిపుణులు అంటున్నారు.