తెలంగాణలో 14 నెలలుగా పాలన బంద్!

July 12, 2020

సాధారణంగా తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏ నాయకుడికైనా కొన్నాళ్లపాటు బాలారిష్టాలు తప్పవు. కానీ, 2014లో తొలిసారి ముఖ్యమంత్రయిన కేసీఆర్ మొదటి నాలుగేళ్లు నల్లేరు మీద నడకలా పాలన సాగించారు. కానీ.. ఆ తరువాతే పాలన పడకేసిందన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. మొదటి విడత పదవీకాలంలో చివరి నెలలు.. ఆ తరువాత రెండోసారి పదవి చేపట్టిన తరువాత ఇప్పటివరకు కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది, రాష్ట్రంలో అనేక రంగాల నుంచి అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
గత ఏడాది ముందస్తు ఎన్నికల వల్ల కొంతకాలం ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆ తర్వాత శాసనసభ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల కోడ్.. ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపు ఇలా అనేక కారణాలతో పాలన పడుతూ లేస్తూ సాగింది. ఇవన్నీ దాటుకుంటూ పాలనను గాడిలో పెట్టాలని ప్రయత్నాలు చేసినా కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి.
కొత్త సచివాలయ నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె.. అన్నిటా ముడి బిగుసుకోవడంతో అన్నీ కోర్టు కేసులుగా మారాయి. ఫలితంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ముందస్తు ఎన్నికలు మొదలు తాజాగా మున్సిపల్ ఎన్నికల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి. ఇక మిగిలిన ఒక్క మున్సిపల్ ఎన్నికలను కూడా ముగించేస్తే పరిపాలనను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.. కానీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కేసులు కొన్ని కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది.
చివరకు బడ్జెట్ కూడా సజావుగా సాగని పరిస్థితి.. మొదటి విడత పదవీకాలం పూర్తికాక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ముందుకెళ్లారు. ఆ తరువాత మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాకే కొత్త బడ్జెట్ వచ్చింది. ఆర్థిక లెక్కలు తేలాయి అనకునేటప్పటికి సచివాలయ మార్పు పాలనకు ఆటంకంగా మారింది. కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపుతో ప్రభుత్వ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఈ అంశం కూడా కోర్టు వివాదంలో చిక్కుకోవడంతో తాత్కాలిక సచివాలయం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరపలేని పరిస్థితి. ఇప్పటికీ ఏ మంత్రి చాంబర్ ఎక్కడుందో తెలియని అయోమయం.
ఆ తరువాత శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అక్టోబర్ మధ్యలో శాసనసభను ఒకటి, రెండు రోజులు సమావేశపరిచి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. అయితే ఉహించని విధంగా అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం.. ఈ వివాదమూ కోర్టులో ఉండడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి అందరూ కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు. సచివాలయం, సమ్మె, కోర్టు కేసులపై సీఎంకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడానికే అధికారులకు సమయం సరిపోతోంది. ఇలా 2018 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు తెలంగాణలో పాలన నిలిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.