అడ్ర‌స్ లేకుండా పోయిన వ‌ర్మ సినిమా

August 07, 2020

రామ్ గోపాల్ వ‌ర్మ ఎంతో హ‌డావుడి చేసి రిలీజ్ చేసిన సినిమా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ముందు క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే వివాదాస్ప‌ద టైటిల్‌తో తెర‌కెక్కి ఆ త‌ర్వాత సెన్సార్ స‌మ‌స్య‌ల కార‌ణంగా టైటిల్ మార్చుకున్న సినిమా ఇది. దీని ప్రోమోలు చూస్తేనే ఇదెంత చీప్ సినిమానో జ‌నాల‌కు అర్థ‌మైంది. ఏపీలో అధికారంలో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు భ‌జ‌న చేస్తూ.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మీద జోకులు పేల్చుతూ వ‌ర్మ ఈ క‌ళాఖండాన్ని తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే ఫిలిం మేక‌ర్‌గా వ‌ర్మ ఎంత‌గా దిగ‌జారిపోయాడో చూశాం. ఈ సినిమా ఆయ‌న ప‌త‌నానికి ప‌రాకాష్ట అని సినిమా చూసిన వాళ్లంద‌రూ ముక్త కంఠంతో తేల్చేశారు.
ఐతే వ‌ర్మ చీప్ ప‌బ్లిసిటీ టాక్టిక్స్ వ‌ల్ల అమ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ అయితే బాగానే వ‌చ్చిన‌ట్లు క‌నిపించాయి. థియేట‌ర్ల ద‌గ్గ‌ర కొంచెం సంద‌డి క‌నిపించింది. అది చూసి వ‌ర్మ మురిసిపోయాడు. త‌న సినిమా సూప‌ర్ హిట్ అన్న‌ట్లుగా ప్ర‌చారం చేసుకున్నాడు. కానీ తీరా చూస్తే రెండో రోజుకు అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అడ్ర‌స్ లేకుండా పోయింది. వెంకీ మామ దెబ్బ‌కు వ‌ర్మ సినిమా గురించి మాట్లాడేవాళ్లే క‌ర‌వ‌య్యారు. ఇక ఆ సినిమా థియేట‌ర్ల‌లో జ‌నాలూ క‌నిపించ‌లేదు. రెండో రోజు నుంచే థియేట‌ర్ల మెయింటైనెన్స్‌కు స‌రిప‌డా చిల్ల‌ర కూడా రాలేదు. సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లే వ‌సూళ్లు ప‌డిపోయాయి. వీకెండ్ లోపే సినిమా దుకాణం ముగిసింది. వ‌ర్మ ఏం చేసినా సినిమా పైకి లేచే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.