టీఆర్ఎస్‌లో వీళ్ల అడ్ర‌స్ ఎక్క‌డ‌...!

July 05, 2020

ఒక‌ప్పుడు టీఆర్ ఎస్‌లో అగ్ర‌నేత‌లుగా వెలుగొందిన ప‌లువురు సీనియ‌ర్ల జాడ ప్ర‌స్తుతం క‌నిపించ‌డంలేదు. మొద‌టిసారి టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు అటు పాలనలో పార్టీకి, ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు కేకే, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావు, కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, స్వామిగౌడ్ ఇలా చాలా మంది హేమాహేమీలు ఇప్పుడు ఇటు పార్టీ కార్యక్రమాల్లో గానీ.. అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో గానీ పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు.

వీరిలో ప‌లువురు నేత‌లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా.. మరి కొందరు రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచా రు. ఫస్ట్ టర్మ్ పాలనలో కీలకంగా వ్యవహరించిన ఈ నేతలంతా సెకండ్ టర్మ్ పాలనలో గప్చుప్ కావడంపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానాలు ఇచ్చేవారే పార్టీలో లేకుండాపోయారని కేడర్తో పాటు కొందరు లీడర్లు కూడా అనుకుంటున్నారు. ఆ నేతలు ఎక్కడికిపోయారని, వాళ్లు యాక్టివ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్రావు పాత్ర ఫస్ట్ టర్మ్ పాలనలో చాలా కీలకంగా ఉండేది. పార్టీలో ప్రభుత్వంలో ప్రత్యేక పోత్ర పోషించేవారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేస్తే ఆయన మీడియా ముందుకు వచ్చి గట్టి కౌంటర్ ఇచ్చేవారు. ఇక అసెంబ్లీలో సీఎం తర్వాత హరీశ్ ఎక్కువగా ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ అపోజిషన్‌‌‌‌ను ఇరుకున పెట్టేవారు. ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను తరచూ తనిఖీ చేసేవారు. కొన్ని సార్లు రాత్రుళ్లు కూడా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించేవారు. ఇంతగా పేరు సంపాదించుకున్న హరీశ్రావుకు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదు. ప్రస్తుతం హరీశ్రావు తన సొంత నియోజక వర్గం సిద్దిపేటకే పరిమితమయ్యారు.

ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో కేసీఆర్ వెన్నంటి ఉన్న నేత నాయిని నర్సింహారెడ్డి. అలాంటి నర్సన్న ఇప్పుడు ఏడున్నడో అని పార్టీ కేడరే దిక్కులు చూడాల్సి వస్తోంది. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో హోం మంత్రిగా నాయిని పనిచేశారు. అప్పట్లో పార్టీ ప్రతి కార్యక్రమానికి ఆయన తప్పకుండా హాజరయ్యేవారు. ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే వెంటనే ప్రెస్మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆయన గొంతు వినిపించడం లేదు.

టీఆర్ఎస్ తొలి సర్కార్లో ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన ఉండే రాజ్యసభసభ్యుడు కె.కేశవరావు జాడ ఇప్పుడు ఎక్కడా లేదు. అలాంటి కేకే ఇప్పుడు పార్టీలో యాక్టివ్ రోల్లో లేకపోవడంపై టీఆర్ఎస్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన హాజరు కూడా చాలా తక్కువగా ఉంటోంది. రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్ తొలి చైర్మన్ గా స్వామిగౌడ్ పాత్రను ఇప్పటికీ టీఆర్ఎస్ వర్గాలు గుర్తుచేసుకుంటుంటాయి. వారిద్దరూ కూడా వారి వారి సభల్లో యాక్టివ్గా పనిచేశారని పేరుంది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనాచారి ఓడిపోయారు. అటు తర్వాత ఆయన జాడే లేకుండాపోయింది.

ఇక కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కు విచిత్ర పరిస్థితి ఎదురవుతోందని ఆయన సన్నిహితులు అంటున్నారు. సీఎంను కలిసేందుకు ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. హైదరాబాద్లోనే నివాసం ఉంటున్న స్వామిగౌడ్ కు స్థానికంగా జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానం అందడం లేదని పేర్కోంటున్నారు.

సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి ఓడిపోయినప్పటి నుంచి ఖమ్మం జిల్లాకే పరిమితమయ్యారు. పా ర్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటున్నట్లు స్థానిక నేతలు అంటున్నారు. జిల్లాకు ఎవరైనా మంత్రులు వస్తే అటువైపు ఆయన వెళ్లడం లేదని, వాళ్లు కూడా తుమ్మలను కలిసేందుకు అంతగా ఉత్సాహం చూపడం లేదని వారు చెబుతున్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి గ‌త ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పాలనలో సుధీర్ఘ అనుభవం ఉన్న ఆయన ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టేవారు. దళితుల అంశాలపైనా ప్రతిపక్షాలను ఇరుకునపెట్టేవారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. అదే జిల్లాకు చెందిన మరో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా దళిత అంశాలపై కేసీఆర్ తరపున గట్టిగా మాట్లాడేవారు. వారిద్దరూ ఇప్పటి సర్కార్లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.