జగన్ దిగిరాక తప్పలేదు... ఇదే రీజన్

May 29, 2020

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ఎలాగైనా మార్చేయాలన్న వైసీపీ అధినేత, ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు ఫలించేలా కనిపించడం లేదు. తాను నోర విప్పకుండానే... తన మంత్రులతో నానా యాగీ చేయించి, రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై జనం మూడ్ తెలుసుకునేందుకు ఓ ట్రయల్ వేసిన జగన్ కు ఇప్పుడు తత్వం బాగానే బోధపడిందన్న వాదన వినిపిస్తోంది. అసలు రాజదానిని అమరావతి నుంవచి తరలించే ఉద్దేశాన్ని జగన్ పూర్తిగా పక్కనపెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు దారి తీసిన కారణాలను సైతం కాస్తంత క్లారిటీగానే బయటకు వస్తున్నాయి.ఆ కారణాలేమిటో చూద్దాం పదండి.

నూతన రాజధానిని ఏపీ సర్కారు స్వయంగా సొంత నిధులతో నిర్మించుకోవడం దుస్సాధ్యం. ఆర్థిక లోటుతో ఉన్న ఏపీ ప్రభుత్వం... రోజువారీ పాలన కోసమే నిధులు చాలక నానా పాట్లు పడుతుంటే... ఇక నూతన రాజధానికి నిధులెక్కడి నంచి తేవాలి? నిజమే... ఒక్క కేంద్రం కనికరం చూపడం మినహా రాజధాని నిర్మాణం పూర్తయ్యే అవకాశాలే లేవు. మరి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే... కేంద్రం నుంచి నిధులు వచ్చేదెలా? ఇదే విషయాన్ని బీజేపీకి చెందిన ఏపీ నేతలు జగన్ సర్కారుకు క్లారిటీగానే చెప్పేశారు. మా పార్టీ నేత, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని తరలిస్తే సహించేది లేదంటూ బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించిన వైనం తెలిసిందే కదా.

ఇక అమరావతిలో ఇప్పటిదాకా కట్టిన భవనాలను అలాగే ఉంచేసి... ఇకపై మిగిలిన కార్యాలయాల నిర్మాణాలన్నింటినీ ఒక్కో ప్రాంతానికి ఒక్కో దానిని కేటాయిద్దామని కూడా జగన్ సంకల్పించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇలా రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా పాలన మరింత సంక్లిష్టమవుతుంది తప్పించిా సులభతరం కాదని అధికారులు జగన్ కు తెగేసి చెప్పారట. ఈ తరహా నిర్ణయాలకు తాము సహకరించమని కూడా వారు జగన్ కు ముఖం మీదే చెప్పేశారట.

ఇక అమరావతిలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులు, ఇప్పటిదాకా జరిగిన పనులపై రివర్స్ టెండరింగ్ విధానంపై ఇప్పటికే ఆర్థిక సంస్థలతో పాటు నిర్మాణ రంగ సంస్థలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అగ్రగామి నిర్మాణ రంగ కంపెనీగా ఎదిగిన ఎల్ అండ్ టీ సీఈాఓ... జగన్ సర్కారు తీరును తప్పుబట్టిన తీరు నిజంగానే ఏపీ సర్కారుకు షాకిచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నిర్మాణ రంగ సంస్థలు స్వచ్ఛందంగా తప్పుకోవడంతో ఇక రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశాలు లేవన్న వాస్తవం కూడా జగన్ పసిగట్టారట. ఈ క్రమంలోనే ఇక రాజధానిని అమరావతి నుంచి తరలించే యోచనను పక్కనపెట్టేద్దామని, ఇకపై దానిపై ఎవరూ మాట్లాడొద్దని కూడా జగన్ తన కేబినెట్ మిత్రులకు సూచించారట. మొత్తంగా దిగితే గానీ లోతు తెలియదన్నట్లుగా వచ్చీ రాగానే తానేదో చేస్తానని ముందుకు దూకితే... పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ కు బాగానే అర్థమైందన్న మాట.