మోదీ, జిన్ పింగ్ భేటీ... మెయిన్ పాయింట్ మిస్ !

May 29, 2020

తమిళనాడు సముద్ర తీర పట్టణం మహాబలిపురం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ల అనఫీసియల్ శిఖరాగ్ర సదస్సు శనివారం ముగిసింది. ఈ భేటీ కోసం చైనా నుంచి వచ్చిన జిన్ పింగ్ కు మోదీ అదిరేటి ఆతిథ్యం ఇచ్చారు. మోదీ ఆతిథ్యం అద్భుతమంటూ జిన్ పింగ్ కూడా కీర్తించారు. సరే... ఓ దేశాధ్యక్షుడన్నాక అతిథి మర్యాదలు బాగానే ఉంటాయి గానీ... రెండు రోజుల పాటు జరిగిన ఈ భేటీలో అసలు ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న అంశం ఆసక్తికరంగా మారింది.

శిఖరాగ్ర సదస్సే అయినా... ఇది అనధికారిక భేటీగా ఇరు దేశాలు ప్రకటించినా కూడా... అసలు ఈ అనఫీసియల్ మీట్ లో ఏఏ అంశాలపై చర్చలు జరిగాయన్నది ఆసక్తికరమే కదా. రెండు రోజులు మహాబలిపురంలోనే ఉన్న మోదీ, జిన్ పింగ్ లు చాలా అంశాలపైనే మాట్లాడుకున్నా... ఇరు దేశాలకు కీలకమైన కాశ్మీర్ అంశం మాత్రం అసలు ప్రస్తావనకే రాలేదట. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో దాదాపుగా అన్ని వివరాలు వెల్లడించారు.  ఈ భేటీపై ఓ ప్రకటనను విడుదల చేసింది.
గోఖలే మీడియా మీట్ లో చాలా ఆసక్తికర విషయాలే ఉన్నాయని చెప్పక తప్పదు. కశ్మీర్‌ భారత అంతర్గత విషయమన్న మన వైఖరికి అందరికీ సుస్పష్టంగా తెలిసిందేనని చెప్పిన గోఖలే.... ఆ వైఖరిని గౌరవించిన జిన్ పింగ్ కూడా రెండు రోజుల భేటీలో అసలు కాశ్మీర్ అంశాన్నే ప్రస్తావించలేదట. కాశ్మీర్ పై భారత్ తో డీ అంటే ఢీ అంటున్న పాకిస్థాన్ కు తనదైన శైలి సాయాన్ని అందజేస్తున్న జిన్ పింగ్... మోదీతో భేటీలో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం నిజంగానే ఆశ్చర్యకరమేనని చెప్పక తప్పదు. అనధికారిక శిఖరాగ్ర సదస్సు కాబట్టి... ఈ భేటీలో ఎలాంటి అధికార లాంఛనాలు కనిపించలేదని, అసలు ఆ దిశగా ఎలాంటి సడీ చప్పుడు లేదని కూడా గోఖలే ప్రకటించారు.
ఇరు దేశాల నేతల మధ్య జరిగిన చర్చలు ఎలా కొనసాగాయన్న విషయానికి వస్తే... ‘మొదట ఇద్దరు నేతలు 90 నిమిషాలపాటు చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రతినిధులస్థాయి చర్చలు జరిగాయి. అనంతరం మోదీ ఇచ్చిన మధ్యాహ్న విందును జిన్‌పింగ్‌ స్వీకరించారు. ఈ సదస్సులో భాగంగా మొత్తం ఆరు గంటల పాటు ఇరునేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. భారత్‌, చైనా మధ్య పరస్పర సహకారం, పర్యాటకం, వాణిజ్యం తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, చైనా ఉపాధ్యక్షుడు హు చున్‌హువా దీనిపై చర్చించనున్నారు’ అని ఈ భేటీ జరిగిన తీరుపై గోఖలే వివరించారు.
చర్చలు ముగిసిన అనంతరం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ట్విటర్‌లో చైనీస్‌ భాషలో కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ వచ్చినందుకు జిన్‌పింగ్‌కు థాంక్స్‌ చెప్పిన మోదీ.. చెన్నై వారధిగా భారత-చైనా సంబంధాలు గొప్పగా ముందుకుసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్ తన పర్యటన ముగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జిన్‌పింగ్ కాన్వాయ్ వద్దకు స్వయంగా వెళ్లి ఆయనను సాగనంపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీతో చర్చలు సంతృప్తికరంగా సాగాయన్నారు. మోదీ ఆతిథ్యం తమను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. ఈ పర్యటన అనంతరం చైనా అధ్యక్షుడు నేరుగా నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. మొత్తంగా ఇటు భారత్, అటు చైనాతో పాటు ఈ భేటీపై అత్యంత ఆసక్తి కనబరచిన పాక్ ప్రజలకు షాకిస్తూ... అసలు ఈ భేటీలో కాశ్మీర్ అంశమే ప్రస్తావనకు రాలేదని గోఖలే సంచలన ప్రకటన చేసేశారు.