సమ్మె వేళ.. ప్రగతిభవన్ లో ఏం జరుగుతోంది?

July 14, 2020

ఒక్కసారి డిసైడ్ అయితే.. నా మాటను నేనే వినన్న డైలాగుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తారా? లేక.. కాస్తంత వెనక్కి తగ్గుతారా? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే.. ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలతో వాతావరణం వేడెక్కిపోయింది. కొంతలో కొంత ఉపశమనం.. దసరా పండుగ రావటం. దీంతో.. పండుగ తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నట్లుగా ఉభయపక్షాలు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా (సోమవారం సాయంత్రం వేళకు) కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ లో సమ్మెకు సంబంధించిన ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధానాలకు సంబంధించిన కొత్త కసరత్తు తీవ్రంగా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎపిసోడ్ లో తన స్టాండ్ కు కట్టుబడి ఉండటమే కాదు.. తాను ఆదివారం చెప్పినట్లుగా ఆర్టీసీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు వీలుగా కొత్త తరహా కసరత్తు షురూ చేసినట్లుగా తెలుస్తోంది.
ఆర్టీసీలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని భావిస్తున్న సీఎం ఆలోచనలకు తగ్గట్లు ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనల్ని సిద్ధం చేసి.. కేసీఆర్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీని బలోపేతం చేయటం.. అతి తక్కువ వ్యవధిలో కొత్త సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
సమ్మె విషయంలో తాను కఠినంగానే ఉండాలన్న ఆలోచనకు కేసీఆర్ కట్టుబడి ఉండటమే కాదు.. యాభై వేల మంది సిబ్బందిని తొలగించినట్లుగా ఇచ్చిన సంకేతాలకు తగ్గట్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా దిగ్భాంత్రి వ్యక్తమవుతున్న వేళ.. ఆయన మాత్రం అదేమీ పట్టనట్లు.. తర్వాతి అడుగుకు అవసరమైన కసరత్తును జోరుగా చేపట్టం చూస్తే.. ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయటం ఖాయమంటున్నారు. ప్రగతిభవన్ లో జరుగుతున్న కసరత్తు.. ఆర్టీసీ కార్మికుల్లో మరింత ఆగ్రహానికి కలిగిస్తుందా? ఆందోళనకు గురి చేస్తుందా? అన్నది కాలమే తేల్చాలి.