అన్నీ దొరకే.... ప్రజలకు గుండు సున్నా

June 01, 2020

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న కేబినెట్ భేటీని సుదీర్ఘంగా నిర్వహించారు. మధ్యాహ్నం మొదలైన కేబినెట్ భేటీలో సాయంత్రం దాకా కొనసాగింది. అంతసేపు కేబినెట్ బేటీ అంటే... ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చాలానే తీసుకుంటున్నారేమో? అన్న భావన వ్యక్తమైంది. అంతేనా... తన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించేందుకు స్వయంగా కేసీఆరే మీడియా ముందుకు రావడంతో మరింత ఆసక్తి రేకెత్తింది. జనం కూడా చాలా ఆసక్తిగా చూశారు. అయితే కేసీఆర్ కేబినెట్ బ్రీఫింగ్ అంతా వన్ సైడెడ్ గానే సాగింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తడం, మోదీని తనదైన శైలిలో తూలనాడటం, తనను ప్రశ్నించిన మీడియాపై చిందులు తొక్కడం మాత్రమే ఆయన చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు. దీంతో ఇదేనా బంగారు తెలంగాణ అంటే... అంటూ జనం నొసలు చిట్లిస్తున్నారు.

కేసీఆర్ కేబినెట్ నిర్ణయాలను ఓ సారి చూస్తే... రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి కార్యాలయాల కోసం స్థలాల కేటాయింపుతో మొదలుపెట్టిన కేసీఆర్... సినీ దర్శకుడు శంకర్ కు ఏకంగా ఐదు ఎకరాల స్థలం, ఏపీకి చెందిన విశాఖ శారదా పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించేశారు. ఇక అన్ని వసతులతో, అందరికీ అందుబాటులో ఉన్న సచివాలయం ఉన్నా కొత్త సచివాలయ నిర్మాణం అంటూ రూ.500 కోట్లు కేటాయించారు.

ఇప్పటికీ చెక్కు చెదరని రీతిలో ఉన్న అసెంబ్లీ భవనాన్ని అలాగే ఉంచేసి కొత్తగా ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ కడతారట. దాని కోసం మరో రూ.100 కోట్లు కేటాయించారు. దాదాపుగా ఇవీ నిన్నటి కేబినెట్ లో కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు. మరి వీటిలో ప్రజలకు పనికొచ్చేది ఒక్కటన్నా ఉందా? అంటే... వాటి జాడే లేదు కదా అన్న సమాధానమే వస్తుంది.

ఎప్పటి నుంచో ఊరిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల మాటే కేసీఆర్ నోట వినిపించలేదు. అన్నదాతలు ఎదురు చూస్తున్న రుణమాఫీ ప్రస్తావన అస్సలే లేదు. ప్రత్యేక తెలంగాణ ప్రధాన నినాదమైన కొత్త కొలువుల మాటే వినిపించలేదు. ఇక ఎన్నికలకు ముందు పెంచిన పింఛన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న మాటే లేదు. మొత్తంగా బంగారు తెలంగాణ మాట అస్సలే కనిపించలేదు. సుదీర్ఘ కేబినెట్ భేటీలో ఒక్కటంటే ఒక్క ప్రజోపయోగ నిర్ణయం లేకపోవడంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది ఇందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమంటూ కేసీఆర్ సాగించిన ఉద్యమంలో అంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తే.... ఇప్పుడు వాటి ఊసే లేకుండా... అంతా తన సొంతానికే అన్నట్లుగా సాగుతున్న కేసీఆర్ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి.