ఆ ఒక్క సీటును వదిలేశారే !

July 13, 2020

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 23న నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు సదరు ప్రకటనలో ఈసీ ప్రకటించింది. ఇంతదాకా బాగానే ఉన్నా... నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు సీట్లతో పాటు తెలంగాణలోని ఓ అసెంబ్లీ సీటు కూడా ఖాళీ అయ్యింది. ఈ ఖాళీ అయిన సీటు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ సీటే. అయితే నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు సీట్లకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ ఉత్తమ్ సీటును మాత్రం లిస్టులో చేర్చకపోవడంపై చర్చ మొదలైంది.

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన ఉత్తమ్ విజయం సాధించారు. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉంటూనే... నల్లగొండ ఎంపీ సీటు నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు కూడా. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎంపీగా కొనసాగేందుకే నిర్ణయించుకున్న ఉత్తమ్... హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది.

ఈ క్రమంలో హుజూర్ నగర్ మాదిరే దేశంలోని మరో నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీ కాగా... వాటన్నింటికీ ఓకే దఫా ఉప ఎన్నిక నిర్వహిస్తారన్న భావన వ్యక్తమైంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. సెప్టెంబర్ 23న ఉపఎన్నికలు జరగనున్నట్లుగా పేర్కొన్న ఈ నోటిఫికేషన్ లో దంతెవాడ (ఛత్తీస్‌గఢ్‌), పాల (కేరళ), బాదర్‌ఘాట్‌ (త్రిపుర), హమీర్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూర్ నగర్ మాత్రం ఈ జాబితాలో లేదు. దీంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నికలు నిర్వహించారా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది. మరి దీనిపై ఈసీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.