గవర్నర్ టర్న్- కేసీఆర్ సర్కారుకు చెమటలు

July 15, 2020

సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు డెడ్ లైన్ పెట్టి.. ఆ డెడ్డ లైన్ లోగా విధులకు రానివారంతా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఏకపక్షంగా, నిర్దాక్షిణ్యంగా, నియంతలా ఇలాంటి ప్రకటన చేశారని అంతా ఘోషిస్తున్నారే కానీ అసలు సెల్ఫ్ డిస్మిస్ అంటే ఏమిటి.. అది చెల్లుతుందా అని ఎవరూ ప్రశ్నించలేదు. కానీ, ఆర్టీసీ సంక్షోభం రోజురోజుకీ ముదురుతున్న వేళ తెలంగాణ గవర్నరు తమిళసై స్పందించి అసలేం జరుగుతోంది... సెల్ఫ్ డిస్మిస్ అంటే ఏంటి అంటూ తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆర్టీసీ సమ్మె నేపత్యంలో సమ్మె తీవ్రత, సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో కార్మికుల తొలగింపు వంటి అంశాలపై  గవర్నరు వివరాలు తెలుసుకున్నారు. కార్మిక చట్టాల్లో ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ అనే పదం ఉందా? అని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ పదం లేకుండా కొలువుల నుంచి 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది.
ఆర్టీసీ జేఏసీతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే పలు దఫాలుగా గవర్నర్‌ను కలిసి సమ్మె గురించి నివేదించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే సమ్మె జరుగుతోందని ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. టీఎస్ ఆర్టీసీ సమ్మె తీవ్రత, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆమెతో బీజేపీ రాష్ట్ర నాయకులు మరోసారి భేటీ అయ్యారు. మరుసటి రోజే  ఆమె ఆర్టీసీ సమ్మెపై రంగంలోకి దిగారు.
కార్మికులతో చర్చలు జరపడానికి, ప్రజారవాణా వ్యవస్థను మాములు స్థితికి తెచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని అజయ్‌కుమార్‌ను ఆమె ఫోన్‌లో ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా బస్సులను నడుపుతున్నామని, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ వచ్చి పూర్తిగా వివరిస్తారని ఆయన చెప్పారు. అనంతరం సునీల్‌ శర్మను రాజ్‌భవన్‌కు గవర్నర్‌ పిలిపించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆయన్ను గవర్నర్‌ అడిగి తెలుసుకున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. ఆయన చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందని గవర్నరు.. సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. గవర్నరుతో భేటీ అనంతరం సునీల్ శర్మ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్‌‌ని కలిసి వివరించారు. గవర్నరు గట్టిగానే నిలదీశారని.. ఇలాగే ముందుకెళ్తే ఇబ్బంది రావొచ్చని సునీల్ శర్మ కేసీఆర్‌తో అన్నట్లు సమాచారం.