ప్రభాస్ అడిగినా ‘కేసీఆర్’ నో అన్నాడు

June 02, 2020

ప్రభాస్ విజ్ఞప్తికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నో చెప్పేయటం విశేషం. ఇంతకీ.. ప్రభాస్ ఏం అడిగారు? అందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పందన వేరుగా ఎందుకు ఉందన్న విషయంలోకి వెళితే..
ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఈ నెల 30న విడుదల కానున్న విషయం తెలిసిందే. భారీబడ్జెట్ తో నిర్మించే చిత్రాలకు తాము పెట్టిన పెట్టుబడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెనక్కి తెచ్చేసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ప్రేక్షకుల ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో భాగంగా.. తమ సినిమా విడుదల సందర్భంగా మొదటి రెండు వారాలకు టికెట్ల ధరల్ని పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటారు.
గతంలోనూ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రానికి ఇదే రీతిలో టికెట్ల ధరల్ని పెంచేసుకునేందుకు వీలుగా నాటి ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఆ తర్వాత కొన్ని క్రేజీ సినిమాలకు ఇదే రీతిలో అనుమతి తెచ్చుకున్నారు. తాజాగా సాహోకు ప్రభాస్ విజ్ఞప్తి మేరకు జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విడుదలైన తొలి రెండు వారాల పాటు థియేటర్లలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరారు.
దీనికి జగన్ సర్కారు ఓకే చెప్పేసింది. తాజా అనుమతితో ఇప్పటివరకూ ఉన్న రూ.100 టికెట్ ధర కాస్తా రూ.200 కానుంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరింది యూవీ క్రియేషన్స్. అందుకు ఏపీ ప్రభుత్వానికి భిన్నంగా కేసీఆర్ సర్కారు ఇప్పటివరకూ స్పందించలేదు. టికెట్ల ధరల పెంపుతో ప్రేక్షకుల మీద భారం పడుతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. రియాక్ట్ కాకుండా ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీప్రభుత్వం సానుకూలంగా స్పందించిన ఉదంతాన్ని చూపించి.. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ప్రభాస్ వినతికి జగన్ మాదిరి కేసీఆర్ ఓకే అనేస్తారా? తన మౌనంతోనే తన నిర్ణయం ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటం ద్వారా.. ప్రేక్షకుల మీద భారం పడకుండా చూసుకుంటారా? అన్నది రానున్న మూడు రోజుల్లో తేలనుంది.