ఆదాయం పెంచుకునే మార్గమెక్కడ సీఎం గారూ??

July 16, 2020

బడ్జెట్‌ చూస్తే.. ఓహో లక్షల కోట్లు.. కానీ పైసా కావాలన్నా ఎదురుచూపులే! రాష్ట్ర సొంత ఆదాయం మాట దేవుడెరుగు.. కేంద్రం నుంచి రావలసిన నిధులను తెచ్చుకోలేని దుస్థితిలో జగన్‌ ప్రభుత్వం పడిపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలుచేసి వాటికి వినియోగ పత్రాలు (యూసీలు) చెల్లించి తిరిగి నిధులు తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమైంది. రూ.2.31 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొంది. కానీ వచ్చే మార్చి నాటికి రూ.1.40 లక్షల కోట్లు వస్తే గొప్పని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులే అంటున్నారు.  కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్లో పెట్టారు. కానీ ఇప్పుడు రూ.17,665 కోట్లు మాత్రమే వస్తాయని అంచనాలను సవరించడం విస్తుగొల్పుతోంది. నవంబరు నాటికి  గ్రాంట్ల రూపంలో రూ.11,031 కోట్లే వచ్చాయి. అంటే గ్రాంట్ల ఆదాయం రూ.43406 కోట్లు తగ్గుతుందన్న మాట. ఇక రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, పబ్లిక్‌ రుణాలు, కేంద్ర పథకాల నిధులు, పన్నుల్లో వాటా నిధులు భారీగా తగ్గనున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఊహల్లో విహారం..
బడ్జెట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరి నాటికి కూడా రూ.14,235 కోట్లు మాత్రమే వస్తాయని ఆర్థిక శాఖ తాజాగా చెబుతోంది. అంటే అంచనా కంటే రూ.17805 కోట్లు తగ్గుతున్నాయన్న మాట. ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి ఊహల పల్లకీ దిగాలని.. లేదంటే తగ్గుదల పెరిగిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర పథకాల నిధులు తగ్గిపోతే ఆ పథకాలు కూడా తిరోగమనంలోకి వెళ్లిపోతాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పాతరేసి నవరత్నాలకు నిధులు సమకూర్చడమే పనిగా జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్లో భారీగా పెట్టారు. ఇప్పుడు రూ.64,562 కోట్లకు మించి రాకపోవచ్చంటున్నారు. పబ్లిక్‌ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం అంచనా వేయగా.. కేంద్రం మొదటి 3 త్రైమాసికాలకు రూ.29,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో క్వార్టరుకు రూ.15వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు అనుమతివ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ రుణం రూపంలో అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి మిగిలిన పరిమితి మరో రూ.3,300 కోట్లు మాత్రమే! బడ్జెట్‌లో పబ్లిక్‌ రుణాల పరిమితిని రూ.44వేల కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రానికి ఉన్న నాబార్డు, ఈఏపీ లాంటి రుణాల రీపేమెంట్లు కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చడం ఖాయం. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్‌ చేస్తాయి. బడ్జెటేతర ఖర్చులు పెరుగుతున్నాయని నీతిఆయోగ్‌ వైస్‌చైర్మన రాజీవ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించారు. అయినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పైపెచ్చు రాష్ట్రాన్ని మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.

Read Also

ఇన్నాళ్లకు జగన్ ని ఇరుకున పెట్టిన చంద్రబాబు
మళ్లీ టీడీపీ - బీజేపీ మధ్య సయోధ్య: సీనియర్ టీడీపీ నేత
అమ‌రావ‌తి మార్పు వెనుక క్రైస్త‌వ మిషిన‌రీలు?