పేదలకు షాక్ : ఆ కీలక పథకం ఎత్తేసిన జగన్ !!

February 24, 2020

ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రగల్భాలు పలికిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆచరణలో మాత్రం తనదైన శైలి మార్కు షాకులిస్తున్నారనే చెప్పాలి. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్ధాకలితో అలమటించే పేదలకు అతి తక్కువ ధరకే కడుపు నింపేందుకు చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూసేసిన జగన్.. ఆ తర్వాత కూడా వరుసగా పేదలకు షాకుల మీద షాకులిస్తున్నారు. 

 

తాజాగా జగన్ ఇచ్చిన షాకుతో రాష్ట్రంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిజమా? అంటే... కళ్లెదుట కనిపిస్తుంటే నిజమని నమ్మక చస్తామా? సరే... ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. 2014లో ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... ఎలాంటి ఆసరా, ఆలంబన లేకుండానే జీవనం సాగిస్తున్న అసంఘటిత రంగ కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకునే నిమిత్తం... చంద్రన్న బీమా పేరిట ఓ అద్బుత పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొంత మేర ప్రీమియానికి రాష్ట్రం వాటా కలిపి... కార్మికులకు బీమా సౌకర్యం కల్పించారు. ఈ పథకం లబ్దిదారులు చనిపోతే... వారి కుటుంబాలకు రూ.5 లక్షలు అందుతాయి. అది కూడా తక్షణమే అందేవి. 2016లో తన చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకాన్ని చంద్రబాబు చాలా పకడ్బందీగా అమలు చేశారు. ఫలితంగా ప్రమాదాల్లో, ఇతరత్రా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచారు. మొత్తంగా ఈ పథకం ద్వారా కార్మికుల కుటుంబాల్లో చంద్రబాబు భరోసా నింపారు.

 

అయితే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన జగన్... సీఎం కాగానే చంద్రబాబు మీద కక్షతో చంద్రన్న బీమాను కాస్తా వైెఎస్సార్ బీమాగా పేరు మార్చేశారు. సరే... వ్యక్తిగత కక్ష అలా చేయించినా... కార్మికులకు అండగా నిలవాలి కదా. కార్మికులకు భరోసా కల్పిస్తున్న ఇలాంటి బ్రహ్మాండమైన పథకానికి ప్రీమీయం కట్టాలి కదా. చంద్రబాబు సర్కారు కట్టిన ప్రీమియం... మొన్న ఆగస్టు దాకా సరిపోయింది. ఆ తర్వాత ప్రీమియం కడితేనే.. కార్మికులకు భరోసా దక్కుతుంది. పేరు మార్పిడిలో చూపిన చొరవ... పథకానికి ప్రీమియం కట్టడంలో జగన్ చూపించలేకపోయారు. ఫలితంగా ఈ పథకం ఇప్పుడు దాదాపుగా నిలిచిపోయింది. ఇక చంద్రబాబు కట్టిన ప్రీమియం కిందే లబ్ధి చేకూరిన వారిలో చాలా మందికి క్లెయిమ్ లు సెటిల్ కావాల్సి ఉంది. అయితే జగన్ కక్ష కారణంగా ఈ పనులు కూడా సాగడం లేదు. వెరసి ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు చంద్రన్న బీమా అందకుండా పోతోంంది. అంతేనా... ఇకపై అసలు చంద్రన్న బీమాను మరిచిపోయేలా జగన్ చర్యలు ఉంటున్నాయి.