చేతగాని వాళ్లే ఇలాంటి పని చేస్తారు - చంద్రబాబు

February 22, 2020

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పన, పెట్టుబడుల రాక అనే కాన్సెప్టే లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు చెందుతుందని ప్రతిపక్ష చంద్రబాబు విమర్శించారు. ఇంత అరాచకమైన పాలన, ఇంత అసమర్థ పాలన ఆంధ్రప్రదేశ్ ఇంతకుమునుపు ఎన్నడూ చూడలేదన్నారు. వైసీపీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే కొత్త ఉద్యోగాలు సృష్టించాలి, దానికి పెట్టుబడులను ఆకర్షించాలి. అంతేగాని ఉన్న ఉద్యోగాలు పీకేసి వాటిని వైసీపీ వారికి పంచడం అనే ఒక నీచమైన సంప్రదాయం జగన్ ప్రభుత్వం ప్రారంభించిందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ వేధింపులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర వేదనలో ఉన్నారన్నారు. వీరి వేధింపులు ఎంతోమందిని ఆత్మహత్యకు పురిగొల్పాయని చంద్రబాబు ఆరోపించారు. 

రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే... ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల వల్ల అనుబంధ ఉపాధి కల్పన జరుగుతుంది. కానీ వీరి స్వార్థం కోసం పెట్టుబడిదారులను ఉన్నవారిని తరిమేసి కొత్త వారిని రాకుండా చేశారు. దీంతో రాష్ట్ర యువత దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. ఉపాధి కల్పన శూన్యం. కొత్త ఉద్యోగాల సృష్టి శూన్యం. 2.60 వేల మందికి తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇచ్చారు. అవి కూడా తమ పార్టీ వారికే ఇచ్చారు. కానీ జగన్ నిర్ణయాలు, పాలనతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇసుక కొరత సృష్టించి రాష్ట్రంలో 30 శాతం జనాభాను ఇబ్బందుల పాలు చేశారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి, మీ అసమర్థత అజ్జానంతో రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయకండి అని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఒకరి ఉద్యోగం పీకి ఇంకొకరికి ఉద్యోగం ఇవ్వడం అనేది అత్యంత చెత్త సంప్రదాయం అన్నారు.