నయా పాలిటిక్స్ - అగ్రవర్ణమా... అయితే నీకు ఛాన్స్ లేదు !!

May 25, 2020

జగన్ తొలి కేబినెట్‌ కూర్పు చూసిన తరువాత చాలామంది సీనియర్ నేతల్లో ఒకరకమైన భావన కనిపిస్తోంది.. కొందరైతే తమ మనసులోని మాటను బయటకు ఎక్స్‌ప్రెస్ చేశారు కూడా. ఇందుకు కారణం.. సామాజిక సమీకరణల పేరుతో ఎంతో సీనియర్లను కూడా పక్కనపెట్టి తొలిసారి గెలిచినవారికీ జగన్ మంత్రి పదవులను ఇవ్వడమే. తాము బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన నేతలమైతే పదవులు వచ్చేవంటూవారు ఆవేదన చెందడం కనిపిస్తోంది.
కర్నూలు జిల్లా పాణ్యం నుంచి గెలిచిన వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పేరు జగన్ మంత్రివర్గంలో ఉండడం గ్యారంటీ అని అందరూ అంచనాలు వేశారు. ఆయన కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ... కర్నూలు జిల్లా ఆలూర్ నుంచి గెలిచిన బోయ(బీసీ) నేత గుమ్మనూరు జయరాంకు ఆ జిల్లాలో చాన్సు దక్కింది. రెడ్డి వర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశం దొరికింది.
కాటసానిలా అందరూ బయటపడి తమ మనసులో మాట చెప్పలేకపోతున్నా ఇలాంటి అభిప్రాయమే చాలామందిలో ఉంది. ఆర్కే రోజా రెడ్డి, రాయచోటి శ్రీకాంత్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటి వైసీపీ నేతలందరికీ అవకాశాలు దక్కకపోవడానికి సామాజిక కూర్పే కారణమన్న భావన వినిపిస్తోంది.
అయితే... టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ కమ్మ సామాజికవర్గాల్లోని ఎందరో సీనియర్ నేతలు, పనిమంతులు కూడా మంత్రులు కాలేకపోయారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర వంటివారు అయిదు అంతకంటే ఎక్కువ సార్లు గెలిచినా కూడా వారివారి జిల్లాల్లో సామాజిక సమీకరణల ప్రకారం పదవులు అందుకోలేకపోయారు. అలా అని.. సామాజిక సమతూకం అవసరం లేదని కాదు.. కానీ, పనితీరు, అనుభవం కూడా పాలనలో అవసరమన్నది గుర్తుంచుకోవాల్సి అంశం.