సింగపూర్ మీడియాతో షాకింగ్ నిజాన్ని చెప్పిన బుగ్గన

May 24, 2020

విదేశీ మీడియా సంస్థలకు కీలక స్థానాల్లో ఉన్న వారు ఇంటర్వ్యూలు ఇవ్వటం కొత్త విషయమేమీ కాదు. కాకుంటే ఒక రాష్ట్ర మంత్రి మరో దేశపు ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
సింగపూర్ కు చెందిన ది స్ట్రెయిట్స్  టైమ్స్ అనే ఆంగ్ల మీడియా సంస్థకు ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశంలో ఇన్ని మీడియా సంస్థలు ఉంటే.. పోయి.. పోయి సింగపూర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వటం ఏమిటన్నది చూస్తే.. భారత్ - సింగపూర్ వ్యాపార.. ఆవిష్కరణ సదస్సుకు ఏపీ తరఫున రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. డెవలప్ మెంట్ ను ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. అన్ని ప్రాంతాల్ని సమానంగా డెవలప్ అయ్యేలా చేయటం.. అందరికి సుస్థిర జీవనం.. అన్నిచోట్ల ఉత్పాదకరంగం ముందుకెళ్లేలా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు.
అమరావతిలో ఆర్థిక నగరాన్ని డెవలప్ చేయటం వరకే సింగపూర్ సంస్థలు పరిమితమన్న ఆయన.. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పరిశ్రమల్ని ఏర్పాటు చేయటానికి తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని తాము విస్మరించలేదని.. దానిపై నిర్ణయం తీసుకోవటానికి కొన్ని నెలలు పడుతుందన్నారు. ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేయటం కంటే.. రాష్ట్రమంతా వికేంద్రీకరించటంపైనే ప్రభుత్వం ఫోకస్ చేసిందన్న విషయాన్ని చెప్పారు.
మొత్తంగా చూస్తే.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పటికిప్పుడు జరగదన్న విషయాన్ని తేల్చటంతోపాటు.. రాష్ట్రం మొత్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో డెవలప్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న విషయాన్ని చెప్పారు. బుగ్గన మాటల్ని చూస్తే.. అమరావతిపై కొత్త సందిగ్థత పెరిగేలా చేశారని చెప్పక తప్పదు.