ఏప్రిల్ 7... కేసీఆర్ లాజిక్ ఏంటి?

June 05, 2020

రెండు.. మూడు రోజులకు ఒకసారి మీడియాతో భేటీ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందులో భాగంగా ఆదివారం రాత్రి కాస్త ఆలస్యంగా ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ముందు.. వరుస పెట్టి.. గంటల కొద్దీ సమయాన్ని వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్న ఆయన.. పలు అంశాల మీద అధ్యయనం చేశారు. ప్రపంచంలోనూ.. దేశంలోనూ.. రాష్ట్రంలోనూ అసలేం జరుగుతుందన్న విషయాల్ని కనుక్కున్న ఆయన.. తనకు తెలిసిన విషయాల్ని ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
కరోనా కారణంగా గడిచిన కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్న వారికి రిలీఫ్ ఇచ్చేలా ఆయన మాటలు సాగాయి. గడిచిన వారానికి పైనే ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. ఇలాంటి పరిస్థితి మరెంత కాలం కొనసాగుతుందన్న విషయంపై క్లారిటీ లేక కిందామీదా పడుతున్న వేళ.. కాస్తంత రిలీఫ్ కలిగే వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. కేసీఆర్ అంచనా ప్రకారం.. ఆయన చెప్పినట్లుగా జరిగితే ఏప్రిల్ 7 బిగ్ డే ఖాయమని చెప్పాలి. కేసీఆర్ చెప్పినట్లు జరిగితే.. తెలంగాణ ప్రజలు పెద్ద పండుగ చేసుకోవటం ఖాయం.
ఇంతకీ ఏప్రిల్ ఏడున ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారన్నది చూస్తే.. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులందరిని క్వారంటైన్ లో ఉంచారు. కరోనా వైరస్ కున్న లక్షణం ప్రకారం పద్నాలుగు రోజుల్లో ఒక వ్యక్తిలో ఉంటే బయటపడుతుంది. ఈ లెక్కన విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి మొదటి క్వారంటైన్ కటాఫ్ డేట్ మార్చి 30న పూర్తి అవుతుందని.. పద్నాలుగు రోజుల క్వారంటైన్ టైం అయ్యాక వారికి పర్యవేక్షణ అవసరం లేదన్నారు.
మార్చి 30న 1899 మందికి క్వారంటైన్ కటాఫ్ డేట్ ముగుస్తుందని.. 31న 1440 మందికి.. ఏప్రిల్ ఒకటిన 1461 మందికి.. ఏప్రిల్ రెండున 1887 మందికి.. మూడున 1476 మందికి నాలుగున 1453 మందికి ఐదున 914 మందికి.. ఆరున 454 మందికి.. ఏప్రిల్ 7న 397 మందికి క్వారంటైన్ కటాఫ్ డేట్ ముగుస్తుందన్నారు. దీంతో.. ఏప్రిల్ ఏడు తర్వాత కరోనాతో సంబంధం ఉన్న వ్యక్తి మన దగ్గర ఉండరని.. అందరికి క్వారంటైన్ ముగుస్తుందన్నారు.
తాను చెప్పినట్లుగా జరిగితే క్వారంటైన్ తో పాటు.. కరోనా కొత్త కేసులు జీరో అయ్యే అవకాశం ఉందన్నారు. ఎయిర్ పోర్టులు.. సీపోర్టులు మూతపడటంతో విదేశాల నుంచి ఈ వైరస్ ను మోసుకు వచ్చే వారు ఎవరూ లేరని.. ఇప్పటికే వచ్చిన వారు 25,932 మంది అని.. వారెవరికి పాజిటివ్ రాకూడదని భగవంతుడ్ని ప్రార్థిద్దామన్నారు. సమస్య తీవ్రత తగ్గిపోయే అస్కారం ఉందని.. లాక్ డౌనే కరోనాకు చెక్ పెట్టే ఆయుధమన్నారు. ప్రతిఒక్కరూ దాన్ని సరిగా వినియోగిస్తే.. సమస్య తీవ్రత తగ్గుతుందన్నారు.