ఇక ప్రత్యేక హోదా రాదు - వైసీపీ ఎంపీ

August 02, 2020

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు....అది సాధించేవరకు ఏపీ ప్రజల తరఫున కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో వైసీపీ పోరాడుతూనే ఉంటుంది....2019 ఎన్నికలకు ముందు వైసీపీ నినాదం ఇది. ఎన్నికలకు ముందు బీజేపీపై వైసీపీ గంపెడాశలు పెట్టుకుంది. బీజేపీకి అనుకూలంగానే ఉన్నాం కాబట్టి ఎలాగైనా హోదా సాధిస్తాం అన్న నమ్మకం వైసీపీ నేతల్లో ఉంది.

అయితే, కేంద్రంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం...ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలు అవసరం లేకపోవడంతో....వైసీపీకి ఆ విషయంలో ఆశలు సన్నగిల్లాయి. దీనికి తోడు బీజేపీ కూడా వైసీపీ విషయంలో సందర్భాన్ని బట్టి విమర్శలు గుప్పిస్తోంది... ఈ నేపథ్యంలోనే కొద్ది నెలల క్రితం పరోక్షంగా బీజేపీపై సాక్ష్యాత్తూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2024లో ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పార్టీ అధికారంలోకి వస్తే తప్ప హోదా సాధించలేమని జగన్ చేసిన వ్యాఖ్యలు హోదాపై ఆశలు సన్నగిల్లేలా చేశాయి. 2024 వరకు హోదా విషయంలో ఏమీ చేయలేమన్న జగన్ వ్యాఖ్యలకు కొనసాగింపుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వత్తాసు పలికారు.

పార్లమెంటులో అడుగుపెట్టకుండానే హోదా కాడిని పిల్లి సుభాష్ వదిలేశారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదనుకుంటున్నానని సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని, హోదా విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయ ఆలోచనలో ఉందని తేల్చేశారు.

గతంలో హోదా విషయంలో పార్లమెంటులో తెలుగు ఎంపీలు గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్యసభకు వెళ్లబోతోన్న పిల్లి....హోదాపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పెద్దల సభలోకి అడుగుపెట్టక ముందే అస్త్రసన్యాసం చేశారు. హోదా విషయంలో ఎంపీగా తనకు భవిష్యత్తులో ఎదురుకాబోయే ప్రశ్నలకు ముందే ఓ సమాధానమిచ్చేశారు.

దాదాపు జగన్ చెప్పినట్లే చెప్పిన పిల్లి సుభాష్... బీజేపీ హయాంలో హోదా సాధ్యం కాకపోవచ్చని తేల్చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్న మాజీ మంత్రి పిల్లి సుభాష్....ప్రత్యేక హోదా కోసం  జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని కితాబిచ్చారు. 20 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాజ్యసభ సభలో తన గళం వినిపిస్తానని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నానని... సీఎం జగన్ కు మంత్రి పదవి రాజీనామా పత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంత్రిగా తనకు సిఎం జగన్ స్వేచ్ఛనిచ్చారని, ఏ రోజు ఆయన కల్పించుకోలేదని తెలిపారు. పార్లమెంట్‌కు వెళ్లాలన్న తన చిరకాల కోరికను జగన్ నెరవేర్చారని అన్నారు.