‘‘జగన్ గురించి నేను చెబితే జనం నమ్మలేదు’’

February 16, 2020

కొత్త ఏడాది వేడుకలకు దూరంగా, అమరావతి రైతులకు దగ్గరగా ఈరోజు చంద్రబాబు గడిపారు. భార్యతో సహా రోజంతా అమరావతిలోనే రైతులకు మద్దతుగా పోరాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మునుపు ఎన్నడూ చేయని కొన్ని కామెంట్లు చేశారు. జగన్ గురించి తాను ముందే గుర్తించి హెచ్చరించినా ఎవరూ వినలేదని, ఇపుడు ఎంత ముప్పు వచ్చిందో చూశారా అంటూ వ్యాఖ్యానించారు.

వద్దు వద్దు అని చెప్పినా ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చారు. అతనికి ఓటేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నాను. అయినా వినలేదు. కరెంటు తీగను పట్టుకోవద్దన్నాను. ప్రయత్నం చేశారు. కరెంటు తీగను పట్టుకుంటే షాకులు తగలకుండా ఉండవు. పోనీ అంతా అయిపోయిన తర్వాత ప్రజావేదికను కూలుస్తున్నపుడు ప్రజలు జగన్ విధానాన్ని, బుద్ధిని అర్థం చేసుకోలేదు. దాన్ని కూలిస్తే మాకెందుకు అనుకున్నారని గుర్తుచేశారు. నా ఇంటిని ముంచే ప్రయత్నం చేసినపుడు కూాడ అది చంద్రబాబు పర్సనల్ గొడవ అనుకున్నారు. కానీ... అది అమరావతిని ముంచే ప్రయత్నంలో జగన్ వేసిన మొదటి అడుగులు అని మీరు గుర్తించలేదన్నారు చంద్రబాబు. 

చెప్పినా వినకుండా మీరే నన్ను ఓడించారని... అయినా పర్లేదు. ఇపుడు పోరాడి సాధించుకుందాం. పట్టుసడలదు. అమరావతి కదలదు అన్నారు. రాష్ట్రానికి రాజధాని ఒక ఇల్లు వంటిదని, ఒకటే ఇల్లు ఉండాలని అన్నారు. ఐదు కోట్ల ప్రజల కోరిక ఇదే అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి. విజన్ 2020 ఫలితాలు 20 ఏళ్ల క్రితం ప్రణాళిక వేస్తే అందరూ నవ్వారు. ఇపుడు తెలంగాణ ఆ ఫలితాలు అనుభవిస్తోంది, అమరావతి విషయంలోనూ ఇంతే. ఎంతో ముందుచూపుతో ప్రణాళిక వేశాం. ఇక్కడ నిర్మిస్తున్నది నగరం కాదు... రాష్ట్ర యువతకు భవితను చూపే వేదిక అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.