తెలంగాణ ఎస్... ఆంధ్రా నో

August 07, 2020

ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో అంతర్ రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. తాజాగా కేంద్రం ఆన్ లాక్ 1.0లో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇందులో కీలకమైనది అంతర్ రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షల్ని ఎత్తివేయాలని సూచించింది. అయితే.. దీనికి సంబంధించిన ఫైనల్ పవర్ ఆయా రాష్ట్రాలదేనని చెప్పింది.

ఇదిలా ఉంటే.. కేంద్రం చేసిన సూచనలకు తగ్గట్లే తెలంగాణలో అంతర్ రాష్ట్రాల రాకపోకలపై మొన్నటివరకూ కొనసాగిన ఆంక్షల్ని ఎత్తివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. అంతర్ రాష్ట్రాల మధ్య ప్రైవేటు వాహనాల రాకపోకలకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిన తెలంగాణ సర్కారు.. ఆర్టీసీ.. ప్రైవేటు బస్సులకు మాత్రం అనుమతిని ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే..తెలంగాణ ప్రభుత్వానికి భిన్నంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తోంది. అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై తాము ఆంక్షల్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా విమానం.. రైలు మార్గాన వచ్చే వారంతా తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. నెగిటివ్ వస్తే హోం క్వారంటైన్.. పాజిటివ్ వస్తే ఆసుపత్రికి పంపుతామని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా.. ఏపీలోని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం నుంచి వచ్చే వారికి ఆంక్షలు అమలు చేస్తామని చెబుతున్నారు.

ఏపీకి రావాలనుకునే వారు తప్పనిసరిగా స్పందన పాస్ తీసుకొని మాత్రమే రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని కోరుతున్నారు. ప్రజలు తమతో సహకరించాలని ఏపీ సర్కారు చెబుతోంది. అంతర్ రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆంక్షల అమలు తీరులో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెప్పక తప్పదు.