జగన్ మడమ తిప్పినట్టేనా ?

February 25, 2020

ప్రత్యేక హోదా... ఏపీకి సంజీవని వంటిదే. ఇది ఏ సామాన్యుడో, మేధావో చెప్పిన మాట కాదు. స్వయంగా విపక్ష నేత హోదా ఉండగా వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీెం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట. విపక్ష నేత హోదాలో ధర్నాలు, ర్యాలీలు, యువ భేరీలు, నిరసన ప్రదర్శనలు ఇలా చాలా కార్యక్రమాలే చేపట్టిన జగన్... తనకు 25 మంది ఎంపీలను ఇస్తే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరతానంటూ శపథం చేశారు.

జగన్ ఆశించినట్టుగానే ఏపీ ప్రజలు రాష్ట్రంలో ఆయనకు అధికారం కట్టబెట్టడంతో పాటుగా 25 మంది ఎంపీ సీట్లలో 22 సీట్లను ఆయనకే కట్టబెట్టారు. అయితే సీఎంగా తొలిసారి స్వతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జగన్ చేసిన కీలక ప్రసంగంలో మాత్రం హోదా మాట వినిపించలేదు. ఎప్పటిలానే టీడీపీపై విరుచుకుపడుతూ... తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఏకరువు పెడుతూ సుదీర్ఘ ప్రసంగమే చేసిన జగన్... తన ప్రసంగంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా పదాన్ని పలకలేదు. ఇంతటి కీలక ప్రసంగంలో ప్రత్యేక హోదా మాట జగన్ నోట వినిపించలేదంటే... దానిని ఆయన వదిలేసినట్టేనా? అన్న కొత్త వాదన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఇచ్చిన మాట తప్పే వంశం తనది కాదని చెప్పే జగన్... తన తండ్రి దివంగత నేత వైెస్ రాజశేఖరరెడ్డి మాదిరే ‘మాట తప్పం, మడమ తిప్పం’ అంటూ సెటైరిక్ డైలాగులు వల్లె వేస్తున్న సంగతి తెలిసిందే కదా. మరి ఏపీకి కీలకంగా మారిన ప్రత్యేక హోదా మాటను తన కీలక ప్రసంగంలో ప్రస్తావించలేదంటే.... ప్రత్యేక హోదా సాధనను జగన్ అటకెక్కించినట్టేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో జగన్ ప్రత్యే హోదాపై మాట తప్పడమే కాకుండా మడమ కూడా తిప్పేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ద్వారా జగన్ తన రాజకీయ ప్రత్యర్థులకు అడ్డంగా బుక్కైపోయారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Read Also

బాబు సెటైర్ ఓ రేంజ్ లో పేలింది - భ్రమరావతిని అలంకరించిన జగన్
ఈ ఛాలెంజ్ ను ఒప్పుకునే దమ్ము కేసీఆర్ కు లేదు
జ‌గ‌న్‌ను న‌మ్మినందుకు నిండా మునిగాడా...!