ఎన్నిసార్లు చెప్పాలయ్యా... అర్థం కాదా?

July 05, 2020

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోమారు తన వైఖరిని క్లిస్టర్ క్లియర్ గానే చెప్పేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని, ఇదివరకే ఈ విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పేశామని చెప్పిన కేంద్రం... మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో చాలా డేరింగ్ ప్రకటనను చేసింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధాన్ని ఇచ్చారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోమారు తేల్చి చెప్పినట్టైంది.

తెలుగు నేల విభజనతో తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో పార్లమెంటు సాక్షిగానే యూపీఏ సర్కారు హామీ ఇచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో యూపీఏ ఓటమి, ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ సర్కారు... ఏపీ పట్ల శీత కన్నేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాను ఇకపై ఏ ఒక్క రాష్ట్రానికి ఇచ్చేది లేదని, ఇందుకు 14వ ఆర్థిక సంఘం నిబంధనలను కారణంగా చూపిన మోదీ సర్కారు... ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోమారు తేల్చి చెప్పిన కేంద్రం... పాత కారణాలను మరోమారు వల్లె వేసింది. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన మేరకు... ఆ దిశగా చర్యలు చేపడతామని రాయ్ ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ అమలుకు చర్యలు తీసుకుంటూనే ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన ఇతర అంశాలపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగని రాయ్... విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీ సర్కారు తన వైఖరిని మరోమారు స్పష్టం చేసిందనే చెప్పక తప్పదు.