జగన్ కి పొద్దున పన్నీరు... సాయంత్రం కన్నీరు

July 13, 2020

బీజేపీ ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని మరోసారి స్పష్టమైంది. మన తెలుగు ఆడపడుచు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రత్యేక హోదాను మరిచిపొమ్మని పార్లమెంటు సాక్షిగా అన్ని రాష్ట్రాలకు చెప్పింది. బీహార్ లోని నలంద ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

బీజేపీకి అన్నీ తెలిసి ఎన్నికల ముందు ఏపీని మోసగించింది. చంద్రబాబుకు ఈ విషయం అర్థమయ్యాక సరే హోదా ఇవ్వకపోయినా పర్లేదు ఏపీకి ఆర్థిక అండ ఇవ్వమని అడిగారు. దానిపై చంద్రబాబును రాజకీయంగా ఇరికించి చివరకు ఏపీకి డబ్బులు, హోదా రెండూ రాకుండా చేశారు. వారి ట్రాప్ లో పడిన చంద్రబాబు బీజేపీకి దూరమయ్యారు. మరోవైపు ప్రత్యేక హోదా మేము సాధిస్తాం అని చెప్పిన వైసీపీ అధినేత జగన్ ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఏం చేస్తాం... సార్ సార్ అని మోడీని అడుక్కుందాం... ఇస్తాడేమో చూద్దాం అన్నాడు.

కానీ ఈరాజకీయాల మధ్య విభజనతో నష్టపోయిన ఏపీ ప్రజలు దారుణంగా మోసపోయారు. వాస్తవాల కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ ప్రచారం జరగడంతో ప్రజలంతా ట్రాప్ లో పడ్డారు. చివరకు మళ్లీ ఏపీకి అదే మోసం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం దిగిపోయేదాకా ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే ప్రసక్తే లేదని తాజా ప్రకటనతో తేలిపోయింది.

కొసమెరుపు ఏంటంటే... ఉదయం ప్రజావేదిక, అక్రమ కట్టడాలు, సురాజ్యం వంటి మాటలు మాట్లాడి వహ్వా వహ్వా అనిపించుకున్న జగన్ సంతోషం... సాయంత్రం కేంద్రం ప్రకటనతో ఒక్కసారిగా నీరుగారిపోయింది.