జ‌గ‌న్ స‌ర్కారు...ర‌హ‌స్య జీఓల మాయాజాలం

February 24, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు సంబంధించిన మ‌రో వివాదాస్ప‌ద తీరు తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌న ప‌రిపాల‌న ఆద‌ర్శ‌ప్రాయం అని ప్ర‌క‌టించుకుంటున్న సీఎం జ‌గ‌న్‌...దానికి భిన్నంగా అడ్డ‌దారిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నే భావ‌న‌ను క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వాలు పరిపాలనకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే, జీవోల రూపంలో విడుదల చేస్తారు. వాటిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతారు. అయితే, పారదర్శకత అంటే ఎంటో దేశానికి చూపిస్తామ‌ని ప్ర‌క‌టించిన జగన్మోహన్ రెడ్డి స‌ర్కారు ర‌హ‌స్య జీఓల‌తో కాలం గ‌డిపేస్తోంది. 2019లో చివరి రోజు డిసెంబర్ 31 న 80 రహస్య జీవోలు ఇవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారింది.
ఏ ప్రభుత్వమైనా జీఓలోని అంశం తెలిస్తే ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయని అనుకుంటేనే ఆ జీఓలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతుంది. ఆ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ రహస్య జీవోలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రహస్య జీవోలను విడుదల చేయకూడదని, ప్రతిజీవోను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ఆదేశించింది. కోర్టులు కూడా అదే మాట చెప్పాయి. అయితే, జ‌గ‌న్ స‌ర్కారు దానికి భిన్నంగా ఏకంగా ఒక్క‌రోజే 80 ర‌హ‌స్య జీఓలు ఇచ్చింది. ఈ జీఓల‌పై స‌హ‌జంగానే అన్ని వ‌ర్గాల్లో సందేహం వ్య‌క్తం అవుతోంది.
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న రాజ‌ధాని అంశంలో ఈ వివాదాస్ప‌ద జీఓలు జారీ చేశారా? ప‌్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ప్ప‌టికీ అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డం స‌హా ఇత‌ర అంశాల్లో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుందా?  వాటిని బ‌హిరంగ ప‌రిస్తే...త‌మ ప్ర‌యోజ‌నాల‌కు ముప్పు వాటిల్లుతుంద‌నే ఇలా చేస్తోందా? అనే సందేహాలు, చ‌ర్చ స‌హ‌జంగానే జ‌రుగుతోంది.