ఈ మాత్రం దానికి రాష్ట్ర విభ‌జ‌న అవ‌స‌ర‌మా కేసీఆర్‌?

July 09, 2020

ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పేసి క‌న్వీన్స్ చేసే ఆర్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌గ్గ‌ర ఎంత‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. వాత పెట్టేట‌ప్పుడు కూడా నొప్పి తెలీకుండా పెట్టే ఆర్ట్ ఆయ‌న సొంతం. అంత న‌ష్ట‌పోయాం.. ఇంత న‌ష్ట‌పోయాం.. మీ దారి మీది.. మా దారి మాది అంటూ మ‌స్తు మాట‌లు చెప్పిన కేసీఆర్‌.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన ఐదేళ్ల త‌ర్వాత ఆయ‌న చెబుతున్న మాట‌లు వింటుంటే అవాక్కు అవ్వాల్సింది.
తాజాగా నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించిన కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట‌ల్ని సింఫుల్ గా చెబితే.. "ఇంత‌కు ముందు పొర‌పొచ్చాలు.. అవ‌స‌రం లేని కయ్యాలు పెట్టుకొని తెలుగు ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయారు. కేంద్రం ప‌రిష్కారం చేయాల్సిన దుస్థితి ఉండొద్ద‌ని ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులం అనుకున్నాం. గ‌వ‌ర్న‌ర్ పిలిచి పంచాయితీ పెట్ట‌టం.. స‌ర్ది చెప్ప‌టం ఉండొద్ద‌ని అనుకున్నాం. ప్ర‌తి దానికీ కేంద్రం కాడికి పోవ‌ద్ద‌నుకున్నాం. రెండు న‌దుల్లో ఉన్న 5 వేల టీఎంసీల‌ను తెలంగాణ‌.. ఆంధ్రాలోని ప్ర‌తి అంగుళానికి తీసుకుపోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చాం. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ప‌ని చేస్తాం. దాని ఫ‌లితాలు కూడా రాబోయే రెండు మూడేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు చూపిస్తా"మంటూ ఫుల్ పాజిటివ్ జోష్ లో కేసీఆర్ మాట్లాడ‌టం క‌నిపిస్తుంది.
కేసీఆర్ తాజా మాట‌ల్నే తీసుకుంటే.. ఇంత మాత్రం దానికి రాష్ట్ర విభ‌జ‌న‌.. రెండు రాష్ట్రాల ఏర్పాటు.. మా బ‌తుకు మాది.. మీ బ‌తుకు మీది లాంటి మాట‌లు.. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య విభ‌జ‌న రేఖ లాంటివి అవ‌స‌ర‌మే లేదు క‌దా. ఈ మాట‌ల‌న్ని విన్న‌ప్పుడు కొంద‌రి ప‌దవుల కోసం.. ప‌వ‌ర్ కోస‌మే రాష్ట్ర విభ‌జ‌న త‌ప్పించి ప్ర‌జ‌ల బ‌తుకుల కోసం కాదా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. న‌చ్చ‌న‌ప్పుడు ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ బూతు క‌నిపించే నేత‌ల‌కు.. న‌చ్చిన‌ప్పుడు ఎంత‌గా స‌ర్దుకుపోతార‌న్న విష‌యం తాజా ఎపిసోడ్ లో కనిపించ‌క మాన‌దు. ఏమైనా.. ఆట ఆడే అధినేతలు.. త‌మ‌కు తోచిన‌ట్లుగా ఆడేస్తుంటే.. వారికి త‌గ్గ‌ట్లు ఉండ‌టం ప్ర‌జ‌ల వంతు అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.