ప్రయోగాల జోలికి వెళ్లని కేసీఆర్

July 05, 2020

అంచనాలు నిజమయ్యాయి. తాజాగా కేబినెట్ విస్తరించి.. ఫుల్ టీంను తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకూడదన్నట్లుగా కనిపిస్తోంది. అందరూ ఊహించినట్లే హరీశ్ కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పజెప్పిన కేసీఆర్.. కొడుక్కి మాత్రం గతంలో ఆయన నిర్వహించిన శాఖల్నే(ఐటీ.. మున్సిపల్.. పరిశ్రమలు) కేటాయించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా సుపరిచితులైన హరీశ్ కు కీలకమైన ఆర్థిక శాఖను అప్పజెప్పారు.
దీంతో.. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ ప్రవేశ పెట్టటమే కాదు.. ప్రసంగ పాఠాన్ని చదువనున్నారు. మిగిలిన వారి విషయానికి వస్తే.. గతంలో హోంమంత్రిగా వ్యవహరించిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. గంగుల కమలాకర్ కు బీసీ సంక్షేమ.. పౌరసరఫరాల శాఖను.. సత్యవతి రాథోడ్ కు గిరిజనాభివృద్ధి.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ.. పువ్వాడ అజయ్ కుమార్కు రవాణా శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

తాజా మంత్రి వర్గ విస్తరణలో హరీష్ రావుకు మంచి పదవి దక్కినా... హరీష్ అభిమానులు సంతోషంగా లేరు. ఎందుకంటే... అది కీలకమైన పదవే గాని నేరుగా ప్రజలతో సంబంధాలు నెరపే పదవి కాదు. జలవనరుల శాఖ మంత్రిగా హరీష్ శ్రమ జనాలకు కనిపించినట్టు ఆర్థిక శాఖలో హరీష్ శ్రమ జనాలకు తెలియదు. అది మేథో శాఖ. హరీష్ వంటి ప్రజా సంబంధాలు నెరపే వ్యక్తి ఆ శాఖ వల్ల ఉపయోగం లేదు అన్నది వారి వాదన. నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నపుడు హరీష్ రావు.. ప్రాజెక్టుల చుట్టు తిరిగేవారు. వాటి పని అయ్యేదాక వెంట పడేవారు. కానీ ఆర్థిక శాఖ అంటే ఫైళ్లపై సంతకాలు పెట్టే వరకే పరిమితం అవుతారని.. ప్రజల్లో తరచూ తిరగలేరనేది ఆవేదన. హరీష్ కు ఈ శాఖ ఇవ్వడం వెనుక వ్యూహం కూడా ఇదేనేమో.