జగన్ కు కొత్త వైరస్...వ్యాక్సిన్ లేదు

June 04, 2020

టీడీపీ హయాంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని, టీడీపీలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి పే....ద్ద పీట వేశారని ఏపీ సీఎం జగన్ అండ్ కో ఆరోపణలు గుప్పించారు. గత ప్రభుత్వంలో నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్ లనూ చంద్రబాబు కుల సమీకరణాల ఆధారంగానే నియమించుకున్నారని, ఉన్నతాధికారుల్లో మెజారిటీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారేనని జగన్ అక్కసు వెళ్లగక్కారు.

ఇక, తాజాగా స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కులాన్ని ఆపాదించిన జగన్ పై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు తనకు క్యాస్ట్ ఫీలింగ్ లేదంటూనే జగన్ తన సామాజిక వర్గానికి చెందిన వారికి విపరీతమైన ప్రాధాన్యతనిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఆరోపణలకు ఊతమిచ్చేలా తాజాగా జగన్ చేపట్టిన ఓ నియామకం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీ సైన్స్ సిటీ సీఈవోగా అప్పసాని కృష్ణారావును తొలగించి తన సామాజిక వర్గానికి చెందిన జయరామిరెడ్డిని నియమించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డించడం జగన్ కు అలవాటేనని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిష్టాత్మక హార్వార్డ్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో విశేష పరిశోధన అనుభవం కలిగిన అప్పసాని కృష్ణారావును ఏపీ సైన్స్ సిటీ సీఈఓ పదవి నుంచి జగన్ తొలగించడం క్యాస్ట్ పాలిటిక్స్ కు నిదర్శనమని విమర్శిస్తున్నారు. అంతటి విశేష అనుభవమున్న అప్పసానిని కాదని స్థానిక కాలేజ్ లో మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తోన్న జయరామిరెడ్డిని ఆ ప్రతిష్టాత్మక పదవిలో నియమించడం జగన్ పక్షపాత ధోరణికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గురివింద నలుపు దానికి తెలియదన్నట్లుగా....ప్రతి విషయానికి చంద్రబాబుకు కులాన్ని ఆపాదించే జగన్ కు తనకున్న క్యాస్ట్ ఫీలింగ్ గురించి తెలియకపోవడం శోచనీయమంటూ సెటైర్లు వేస్తున్నారు. జగన్ కు వ్యవస్థలను కామెడీ చేయడం అలవాటేనని ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోందని, ఆ వైరస్ కు మరి కొద్ది నెలల్లో వ్యాక్సిన్ కనుగొంటారని...కానీ, ఏపీ సీఎం జగన్ కు కరోనా క్యాస్ట్ వైరస్ పట్టుకుందని...దానికి వ్యాక్సిన్..లేదని సెటైర్లు వేస్తున్నారు.