పాపం.. ప్రశాంత్ కిశోర్

August 14, 2020

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పట్టిందల్లా బంగారంలా ఉంది... అత్యంత వివాదాస్పద అంశాలనూ సునాయాసంగా డీల్ చేసుకుంటూ సాగిపోతున్నారు మోదీ-షా ద్వయం. ఇప్పటికే కశ్మీర్ వంటి అంశాల్లో ముందుకెళ్లిన ఆ ఇద్దరూ ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లులోనూ పంతం నెగ్గించుకున్నారు. పరిమిత ప్రాంతాలు, పరిమిత వ్యక్తులు, పరిమిత పార్టీల నుంచి వ్యతిరేకతలు వస్తున్నా ఆ వ్యతిరేకత వల్ల కలిగే నష్టం కంటే మిగతా చోట్ల కలుగుతున్న రాజకీయ ప్రయోజనాన్ని చూసుకుంటూ, జాతి ప్రయోజనాల పేరిట వారు ముందుకు వెళ్తున్నారు. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాం అట్టుడికినా మిగతా ప్రాంతాల్లో దీనికి మద్దతే దొరికింది.. కొద్దిమంది నాయకులు దీన్ని వ్యతిరేకించినా మిగతా వారు బహిరంగంగా సమర్థించారు.. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో గొంతు తగ్గించుకున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా సైతం తొలుత ఇదో చీకటి రోజు అని చెప్పినప్పటికీ ఆ తరువాత స్వరం తగ్గించారు.. ఇంత హడావుడిగా ఆమోదించడంపైనే తమ వ్యతిరేకత అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
పార్టీలు, వాటిని నడిపించే రాజకీయ నాయకుల సంగతిని పక్కన పెడితే రాజకీయ పార్టీలకు సలహాలిస్తూ, పలు పార్టీలను గెలుపు బాట పట్టించిన ప్రశాంత్ కిశోర్ సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. జేడీయూలో ఉన్న ఆయన ఆ పార్టీ ఈ బిల్లుకు మద్దతివ్వడాన్ని తప్పుపట్టారు.
విచిత్రమేమిటంటే ప్రశాంత్ కిశోర్ ఎవరి కోసమైతే పనిచేశారో ఆ పార్టీలన్నీ కేంద్రానికి, ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. ప్రశాంత్ కిశోర్ ప్రస్థానం బీజేపీ నుంచి మొదలైంది.  2014 ఎన్నికల్లో ఆయన మోదీ విజయం కోసం పనిచేశారు. ప్రశాంత్ ఆ తరువాత జేడీయూ కోసం పనిచేశారు.. శివసేనే, వైసీపీ కోసమూ పనిచేశారు. వీటిలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి బిల్లును తేగా... దానికి జేడీయూ, వైసీపీ, శివసేన మద్దతిచ్చాయి. శివసేన రాజ్యసభలో సభ నుంచి వచ్చేసినా లోక్ సభలో మాత్రం నేరుగా మద్దతిచ్చింది.
నిజానికి ప్రశాంత్ కిశోర్ తొలుత అమిత్ షాతో కలిసి బీజేపీ విజయానికి పనిచేసినా ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల తరఫున పనిచేశారు. కానీ, అవన్నీ బీజేపీ పంచనే ఉన్నాయి. ప్రశాంత్‌ను తమతో కలిసి పనిచేయాలని బీజేపీ ఆ తరువాత కూడా అడిగినా ఆయన విభేదిస్తూ వచ్చారు. కానీ, ఆయన ఎలక్షన్ సర్వీసెస్ అందించిన పార్టీలు మాత్రం బీజేపీనే సపోర్టు చేస్తుండడం విశేషం.