ఒక్క ఓటు కూడా పడలేదు...!

July 12, 2020

ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం, పెరగడం సహజం. కానీ ఓటర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండటం మాత్రం నిజంగా పెద్ద విషయమేనని చెప్పాలి. తొలి విడత ఎన్నికల్లో అక్కడ 15 బూత్ లలో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. అక్కడి ఓటర్ల ఇళ్లకు పోలింగ్ సిబ్బంది వెళ్లి, ఓటు వేసేందుకు రావాలని బతిమిలాడారు. అయినప్పటికీ, ఒక్కరంటే ఒక్క ఓటరు కూడా ముందుకు రాలేదు. ఇది ఎక్కడ జరిగిందో చూద్దాం.

అది, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా. ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఈ జిల్లాలో మొత్తం 540 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లోని 15 బూత్ లలో ఒక్క ఓటు కూడా నమోదవలేదు. ఎన్నికలను బహిష్కరించాలంటూ రెండు నెలలుగా మావోయిస్టులు ఇక్కడ ప్రచారం చేశారు. వారి మాటను కాదని ఓటు వేస్తే ఏం జరుగుతుందోనని అక్కడి ప్రజలు తీవ్రంగా భయపడ్డారు.

ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో భద్రత కల్పించినప్పటికీ ఆ ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వారి భయానికి అర్థముంది. ఎన్నిక జరిగే ఈ ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. ఆ తరువాత పరిస్థితేమిటి...? తమ మాట కాదని ఓటేస్తారా.. అంటూ, ఏ అర్ధరాత్రో అపరాత్రో మావోయిస్టులు వచ్చి దాడి చేస్తే...? ఈ భయంతోనే అక్కడి ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. మరోవైపు, కలహంది ప్రాంత ఓటర్లు, తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదనే కారణంగా ఎన్నికలను బహిష్కరించారు. ఈ జిల్లాలో 11న సాయంత్రం ఆరు గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత (2014) ఎన్నికలకంటే నాలుగు శాతం ఎక్కువ. ఈ 15 బూతులలో రీపోలింగ్ విషయం.. ఈసీ పరిశీలకుడి నివేదికపై ఆధారపడి ఉంటుందని అక్కడి కలెక్టర్ చెప్పారు.

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ లోక్సభ నియోజకవర్గంలోనూ మావోయిస్టుల బెడద తీవ్రంగానే ఉంది. అందుకే ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. 80వేల మంది రక్షణ సిబ్బంది పహారా కాశారు. మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉన్న దంతెవాడ ప్రాంతం ఈ లోక్ సభ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ 741 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా ప్రభుత్వం గుర్తించింది. దంతెవాడలోనూ హింసాత్మక ఘటనలకు మావోయిస్టులు తెగించారు. అయినప్పటికీ ఇక్కడ గణనీయంగానే ఓటింగ్ నమోదైంది.