అదిగదిగో ఓట్లు.. విసిరేసెయ్ నోట్లు...

July 06, 2020

ఓట్ల జాతరొచ్చింది. నోట్లు తీసుకొచ్చింది. పల్లె.. పట్టణం తేడా లేదు. ఊరు ఊరునా, వాడ వాడలా ఓట్ల-నోట్ల జాతర సాగుతోంది. ప్రాంతం ప్రస్తావన లేకుండా నేరుగా విషయంలోకి వద్దాం.

అదొక పట్టణం. ఒక పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌, తన వార్డులో ఇంటింటికీ వెళుతున్నారు. మహిళా ఓటర్లను, మరీ ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముచ్చటిస్తున్నారు. బ్యాంక్ ఖాతా, ఆధార్‌ వివరాలిస్తే ఐదువేల రూపాయలను జమ చేయిస్తామని చెబుతున్నారు. తమ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారు. అంతేకాదు, ’’మీరు ఎవరికి ఓటేశారో కూడా మాకు తెలుస్తుంది. మీరు డబ్బు తీసుకుని కూడా మా పార్టీకి ఓటెయ్యకపోతే... ఆ విషయం కూడా మాకు తెలుస్తుంది. మీ ఖాతా నుంచి మేం వేసిన నగదును వెనక్కు తీసుకుంటాం‘‘ అని, ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ‘‘నిజమేనేమో... డబ్బిచ్చారు కాబట్టి, వారు చెప్పినోళ్లకే ఓటేద్దాం‘‘ అనుకున్న వారు కొందరైతే, ‘‘ఖాతాలో డబ్బు వేయడం వరకే వారికి వీలవుతుంది. వెనక్కి తీసుకోవడమనేది కాని పని. ఇచ్చారు కాబట్టి తీసుకుంటాం. ఎవరికి ఓటు వేయాలనేది మా ఇష్టం‘‘ అనుకుంటున్న తెలివైన ఓటర్లు కూడా ఉన్నారు.
- ఒక ప్రధాన పార్టీలో ఆమె నాయకురాలు. ఆర్థికంగా బలవంతురాలు. పసుపు-కుంకుమ పథకం లబ్ధిదారులంతా ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించారు. తమ పార్టీ మద్దతుదారులు లీడర్లుగా ఉన్న సంఘాలను గుర్తించారు. ఆ లీడర్లతో ఇటీవలే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారందరికీ భారీగా నజరానాలు పంచారు. తమ సంఘాల్లోని సభ్యులతో మన పార్టీకి ఓటేసేలా చూడాలని ‘దిశానిర్దేశం’ చేశారు. ఆ సంఘాల నాయకులు రంగంలోకి దిగుతున్నారు. ’’టీడీపీకి కాకుండా ఫలానా పార్టీకి మనమంతా ఓటేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల వరకు మన గ్రూపు ఖాతాలో నగదు జమ అవుతుందట. దానిని మనమందరం పంచుకుందాం‘‘ అంటూ, లీడర్లు ప్రచారం చేస్తున్నారు.
- ఇటీవల ఓ మండలంలోని కొన్ని గ్రామాలకు కొందరు మహిళలు వెళ్లారు. పొదుపు మహిళల ఇళ్లకు వెళ్లారు. ’’మేం సర్వే బృందం సభ్యులం. మీ బ్యాంకు ఖాతా, ఆధార్‌, పొదుపు సంఘం వివరాలు ఇస్తే నగదు మార్పిడి చేయిస్తాం. అందుకు ప్రతిఫలంగా మీరు మేం చెప్పిన పార్టీకి ఓటెయ్యాలి‘‘ అని చెప్పారు.
- ఇటీవల, ఒక పార్టీ అధినేత స్వయంగా పెద్ద హామీ ఇచ్చారు. ’’మేం అధికారంలోకి వస్తే స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తాం‘‘ అని ప్రకటించారు.

డ్వాక్రా మహిళలే లక్ష్యంగా ప్రచారం, ప్రలోభాలు సాగుతున్నాయి. ఇటీవల ఒక ప్రధాన పార్టీ కార్యకర్తలైన మహిళలు బృందాలుగా ఏర్పడ్డారు, తటస్థులు, పత్యర్థి పార్టీ మద్దతుదారుల జాబితా సిద్ధం చేశారు. నేరుగా వారిని కలుసుకున్నారు. ‘‘వచ్చేది మా ప్రభుత్వమే. మీ సంగతులన్నీ మాకు తెలుసు. మా పార్టీకి ఓటేస్తే మీకే మంచిది. మా ప్రభుత్వం రాగానే మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అవతలి పార్టీకి ఓటేస్తే.. మీ ఇష్టం. మా ప్రభుత్వమొచ్చాక మీరే ఇబ్బంది పడతారు’’, అని బెదిరింపు ధోరణిలో హెచ్చరిస్తున్నారు. తటస్థులపై ఇది బాగానే ప్రభావం చూపుతోంది.

నేరుగా ఇంటింటికీ వెళ్లడం, ఓట్ల కోసం వల వేయడం కష్టంగా ఉండడం, ఎన్నికలకు గడువు కూడా దగ్గరపడడంతో (ఓట్ల) ‘వేటగాళ్లు’ (అభ్యర్థులు, పార్టీల నాయకులు) రూటు మార్చారు. ‘ఆత్మీయ’ మార్గం ఎంచుకున్నారు. వర్తక, వ్యాపార, కార్మిక, కర్షక, స్వయం సహాయక సంఘాలు, కిరాణా వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదులు, చిరుద్యోగులు, ఉదయాన్నే నడక సాగించే వాకర్లు, మత బోధకులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, యువజన, క్రీడా సంఘాలు, యూనియన్లు, స్వచ్ఛంద సంస్థలు, జడ్పీటీసీ-ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ సంఘాలు, కార్పొరేషన్ల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పంచాయతీ పాలకవర్గాలు.. ఇలా వీరూ-వారూ అని కాకుండా, అందరినీ కలుస్తున్నారు. సమూహాలవారీగా ఎక్కడికక్కడ ఆత్మీయ (అదేమిటోగానీ... ఎన్నికలప్పుడు మాత్రమే ఆత్మీయత, అనుబంధం, అనురాగం.. ఇత్యాదివన్నీ ఈ నాయకులకు గుర్తుకొస్తాయి. ఎన్నికలైపోగానే ఇవన్నీ వారిలో మచ్చుకైనా కానరావు...) సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో కొన్నిచోట్ల విందు-మందు కూడా సిద్ధం చేస్తున్నారు. కండువాలు కప్పేందుకు సన్మానాలు చేసేందుకు-చేయించుకునేందుకు కూడా ఈ సమావేశాలే వేదికలుగా మారుతున్నాయి. ఇలా సమావేశాలకు రాని (రాలేని) వారి వద్దకే (ఉపాధి కూలీలు, దినసరి కూలీలు, సంఘటిత-అసంఘటిత కార్మికులు) అభ్యర్థులు-నాయకులు వెళుతున్నారు. ఈ సమావేశాల సారాంశమంతా ఒక్కటే- ‘‘మాకు మీరు. మీకు మేము’’.

- అసలే ఇది ఎండాకాలం. ఎక్కడైనా చిన్న గుడిసె కాలిపోయిందంటే చాలు. పరుగెడుతున్నారు. కాసేపు పరామర్శించి, సాయం పేరుతో ఎంతోకొంత చేతిలో పెడుతున్నారు. ఏ ఇంటిలోనైనా చావు, తద్దినం ఉందంటే చాలు... పరుగు పరుగున వెళుతున్నారు. పలకరించి వస్తున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్. కాకితో కబురంపితే చాలు (కబురు-పిలుపు లేకపోయినా కూడా)... రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. వధూవరులను ఆశీర్వదించి, బహుమతి ఇచ్చి వస్తున్నారు.

- ఒక జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీకి దాతృత్వం ‘కట్టలు’ తెంచుకుంది. ఆ నియోజకవర్గంలో మైనారిటీల ఓట్లే కీలకం. ఇంకేం... ! ఆ అభ్యర్థి/పార్టీకి చెందిన మైనారిటీ నాయకులు స్థానిక మసీదులకు వెళ్లారు. అక్కడి ఇమామ్‌, మౌజన్లకు మంగళ, బుధవారాల్లో తోఫాలు అందించారు. ‘కట్టలు’ తెగేలా ‘దాతృత్వాన్ని’ చాటుకున్నారు..! మసీదుకు 50వేలు, ఇమామ్‌కు 10వేలు, మౌజన్‌కు ఐదువేల రూపాయల చొప్పున తోఫాగా ఇచ్చారు.
- ఓట్ల వేటలో ఎన్నెన్ని పాట్లో, ఎన్నెన్ని నోట్లో చూశారు కదా..! ఈ పాట్లు ఫలిస్తాయా..? నోట్లతో ఓట్ల వర్షం కురుస్తుందా...? ఏమో... చూడాలి...!!