జమ్ము కాశ్మీర్ పై మోడీ కొత్త ప్లాన్

November 17, 2019

జమ్మూకశ్మీర్ ను బీజేపీ ప్రభుత్వం చాలా చాకచక్యంగా డీల్ చేస్తోంది. రాష్ట్ర విభజన ఇవ్వడం, ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం వంటి అతిపెద్ద నిర్ణయాలతో ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేసిన మోడీ... అక్కడ పాగా వేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. జమ్ముకాశ్మీర్ యువతను బిజీగా ఉంచడానికి జమ్ముకాశ్మీర్ చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం ఒకటి తీసుకున్నారు. 

యువతకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా వారిని తీవ్రవాదం వైపు నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్యోగాలు ఎరగా వేయాలని నిర్ణయించిన కేంద్రం... ఒకేసారి 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తోంది. ఒక ప్రాంతంలో ఇన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అవడం చాలా అరుదైన విషయం. కొంచెం జాగ్రత్తపడి చదివితే, ఒక్క మూడు నెలలు కష్ట పడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సెటిలైపోవచ్చు అన్న గుడ్ న్యూస్ తో ఆవేశాలను చల్లార్చి ఆనందోత్సాహాలు వెల్లివిరిసేలా చేస్తోంది కేంద్రం. స్థానిక యువతలో ఈ నిర్ణయం ద్వారా కొత్త ఆశలు చిగురించాయి.

ఈ నోటిఫికేషన్ గురించి గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు. మరో సంచలనం ఉందని, త్వరలోనే జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేయనుందని, త్వరాలో ఆ వివరాలు తెలుస్తాయని అన్నారు. జమ్మూకశ్మీర్ ఉనికి, సంస్కృతికి యతాతథంగా కాపాడుతామని తెలిపారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలు కేవలం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే బంద్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో వీటి సేవలను ఉగ్రవాదులు దుర్వినియోగం చేస్తారని అన్నారు.