కుట్రే ఇది- ఏపీలో ఏం జరుగుతుందో తెలుసా

July 04, 2020

ఏపీలో చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఈసీల మధ్య జరుగుతున్న ఘర్షణ చూస్తుంటే రాష్ట్రాన్ని పరోక్షంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసినట్లుగా కనిపిస్తోంది.
ఏపీలో ఏప్రిల్ 11న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 23న ఫలితాలు వచ్చేవరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఇంటెరిమ్ సీఎంగా మాత్రమే మిగిలిపోయారు. అయితే, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో మాత్రం మునుపటిలాగే వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన్ను పూర్తిగా కట్టడి చేసేందుకు కూడా ఇతర పక్షాల నుంచి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి. పాలన పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉండగా.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారాల్లేని సీఎంలా వ్యవహరిస్తున్నారు. పోలవరం, అమరావతి పనుల ప్రగతి.. తాగునీరు, విపత్తుల నిర్వహణ వంటి అంశాలపై గత వారం చంద్రబాబు అధికారులు సమీక్షించగా.. ఎన్నికల కమిషన్ అడ్డంపడింది. శాఖలపై అధికారులతో సమీక్షించే అధికారం ఇప్పుడు చంద్రబాబుకు లేదని అభ్యంతరపెట్టారు.
అంతేకాదు... ఇంటిలిజెన్స్ చీఫ్‌ను కూడా చంద్రబాబుకు రిపోర్టు చేయొద్దని ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు నిర్వహించే సమీక్షలకు ఎలక్షన్ కమిషన్ నియమించిన కొత్త చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా హాజరుకావడం లేదు. అక్కడితో ఆగలేదు... తిరుమల వేంకన్న ఆలయానికి చెందిందిగా చెబుతున్న 1831 కేజీల బంగారం తరలింపు వ్యవహారంపైనా సీఎస్ విచారణకు ఆదేశించారు.
మరోవైపు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, పింఛన్లకు విడుదల చేసిన నిధుల విషయంలో సీఎస్ సమీక్షించారు. సీఎస్ ఇలా సమీక్షించడంపై ఆర్థిక మంత్రి యనమల అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆర్థిక అంశాలపై ఎలా సమీక్షిస్తారని.. పైగా సీఎస్ కూడా ఇంటెరిమ్ సీఎస్ అని గుర్తుచేశారు. ఇంటెరిమ్ సీఎస్ కేబినెట్ నిర్ణయాలను సమీక్షించలేరని అన్నారు.
కానీ, సీఎస్ సుబ్రహ్మణ్యం ఏమాత్రం ఆగలేదు. ఎన్నికల ఫలితాలకు సన్నద్ధతపై ఆయన సమీక్ష జరిపారు. ఆ మీటింగ్‌కు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా హాజరయ్యారు. జిల్లాల్లోని ఎస్పీలు, డీజీపీ, హోం సెక్రటరీలతో ఈ సమీక్ష జరిపారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. సీఈఓ కానీ, సీఎస్ కానీ ఇలాంటి సమీక్షలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. చంద్రబాబుకు 2019 జూన్ 7 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే హక్కు ఉందని.. ఆయన్ను కాదని, అధికారులు ఇలా ఎలా వ్యవహరిస్తారన్నది వారి ప్రశ్న.
నిజానికి తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య గతంలోనూ విభేధాలున్నాయి. అలాగే ఒకప్పుడు చంద్రబాబుకు ఆయన ఎంతో ప్రీతిపాత్రమైన అధికారిగా కూడా ఉండేవారు. 19992004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హైదరాబాద్‌లో నేషనల్ గేమ్స్ నిర్వహణ, ఆఫ్రో ఏసియన్ గేమ్స్ నిర్వహణలో సుబ్రహ్మణ్యం కీలకంగా వ్యవహరించారు. కానీ... 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారాయి. సుబ్రహ్మణ్యం ప్రాధాన్యం తగ్గిపోయింది. 1983 బ్యాచ్ అధికారి అయిన సుబ్రహ్మణ్యంను కాదని ఆ తరువాత బ్యాచ్‌కు చెందిన పునేఠాను చంద్రబాబు సీఎస్ చేశారు. అయితే.. రాజకీయ ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ పునేఠాను తప్పించి సుబ్రహ్మణ్యంను సీఎస్‌ను చేసింది. అక్కడ నుంచి సుబ్రహ్మణ్యం తానే అంతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా ఈసీ నియమించినప్పుడే చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆయన ఎమ్మార్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు.
అయితే... ఈ వ్యవహారం ఎంత ముదురుతున్నా చంద్రబాబు కూడా ఏమాత్రం తగ్గడంలేదు. మే మొదటి వారం నుంచి తాను సమీక్షలు నిర్వహిస్తానని చెబుతున్నారు. ఈసీతో తాడోపేడో తేల్చుకోవాలన్నది ఆయన నిర్ణయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ దక్షిణ తీరాన్ని ఫణి తుపాను తాకే సూచనలు ఉండడంతో చంద్రబాబు దీనిపై సమీక్షకు రెడీ అవుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ప్రకృతి విపత్తులు సంభవించే ప్రమాదం ఉన్నప్పుడు ఇంటెరిమ్ సీఎంకు ఇలాంటి అంశాలపై సమీక్ష జరిపే అధికారం ఉంటుంది.
ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలోనే చంద్రబాబు ఈసీ తీరుపై మండిపడుతూ 9 పేజీల లేఖ రాశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను తనకు రిపోర్టు చేయొద్దని ఈసీ చెప్పినప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఐబీ డైరెక్టర్లను కూడా ప్రధానికి రిపోర్టు చేయొద్దని ఆదేశించాలని ఆయన వాదిస్తున్నారు. దీంతో... చంద్రబాబు వాదనలోనూవాస్తవాలున్నాయన్న మాట వినిపిస్తోంది.
అన్నిటికీ మించి కేంద్రం ఈసీ ద్వారా చంద్రబాబును కట్టడి చేస్తోందని... ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో పరోక్షంగా రాష్ట్రపతి పాలన విధించినట్లో.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినట్లో ఉందని అంటున్నారు.