క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి జైలు పాలైన ఎన్నారైలు

August 06, 2020

వాళ్లు ప‌నిలో ఏ త‌ప్పు చేయ‌లేదు. అయినా జైలు పాలు అయ్యారు. మ‌రి వారిని జైలు పాలు చేసిన ప‌నేంటి?

అజ‌య్ బ్రత్వాల్, దిలీప్ నైక్‌, భావేష్ మిస్త్రీలు... ముగ్గురు భారతీయులు. అమెరికాలో ఉంటున్నారు. కంపెనీ పెట్టి ప‌నిచేసి డ‌బ్బులు సంపాదించాల‌ని త‌ల‌చారు. ప్లాన్ చేశారు. క‌ష్ట‌ప‌డ్డారు. వారి ప్లాన్ స‌క్సెస్ అయ్యింది. క‌ల నెరవేరింది. కంపెనీ లాభాల బాట‌లో ప‌య‌నించింది. ఒకటికి రెండు సెంట‌ర్లు ఏర్పాట‌య్యాయి. న్యూజెర్సీ, నెవార్క్, న్యూయార్క్ న‌గ‌రాల్లో కంపెనీ విస్త‌రించింది. క‌ట్ చేస్తే... ఇపుడు జైల్లో ఉన్నారు. 

వారు కంపెనీ న‌డ‌ప‌డంలో ఏ త‌ప్పూ చేయ‌లేదు. కాక‌పోతే వారికి వ‌చ్చిన లాభాలు భారీగా ఉండ‌టంతో స‌గ‌టు ఇండియ‌న్‌లాగే ఆలోచించారు. ఇంత లాభాల్లో గ‌వ‌ర్న‌మెంటుకు భాగ‌స్వామ్యం ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు. లాభాలు స‌గం దాచారు. అన్ని దేశాల అధికారులు ఒక‌లా ఉండ‌రు క‌దా. అధికారులు అనుమానం వ‌చ్చింది. వీరి మీద ఓ క‌న్నేసి ఉంచారు. ఎట్ట‌కేల‌కు ప‌దేళ్ల‌కు వారు చేసిన తప్పును ప‌ట్టుకుని విచారించి శిక్ష వేశారు.

ఆదాయపన్ను ఎగ్గొట్టిన కేసులో ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయ‌గా, కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 2009 నుంచి 2011 మధ్య కాలంలో ఫార్మసీ కంపెనీ 9 మిలియన్ డాలర్లు లాభం రాగా... వారు కేవ‌లం 4 మిలియన్ డాలర్లు మాత్రమే లాభం వచ్చినట్లు ప్ర‌భుత్వానికి చూపారు. మిగ‌తా సొమ్ము చెక్కుల ద్వారా నెం.2 అక్కౌంట్స్ లో వేసుకున్నారు. వారి ఆట‌లు ఎంతో కాలం సాగ‌లేదు. అన్ని తెలివితేట‌లు ఉండి... లాభాలు సంపాదించి ఏం లాభం. జైల్లో ఊచ‌లు లెక్క‌పెడుతున్నారు.