ఎన్నారై టీడీపీ మీట్ ఆండ్ గ్రీట్ - లగడపాటి హైలైట్

August 05, 2020

ఎన్నారై టీడీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ మీట్ ఆండ్ గ్రీట్ విజ‌య‌వంతం అయింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని మిల్‌ పిటాస్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం అధ్యక్షతన ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కమిటీ కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ ఎల్‌.వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, విజయవాడ మాజీ పార్లమెంట్‌ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హాజ‌ర‌య్యారు.

కోమ‌టి జ‌య‌రాం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎల్‌వీఎస్ఆర్‌కే ప్ర‌సాద్ మాట్లాడుతూ, చంద్ర‌బాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలిచి మే23న మ‌రోమారు ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నార‌ని అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ విజ‌యానికి కృషి చేసిన వారంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలుగువారు ఎక్క‌డుంటే అక్క‌డ తెలుగుదేశం పార్టీ ఉంటుంద‌న్నారు. అమెరికాలో ఉన్న‌వారు తెలుగువారు కాదు తెలుగుయోధులు అని ప్ర‌శంసించారు. ప్ర‌ధాని మోదీ ఏపీకి చేసిన మోసానికి పోరాటం కొన‌సాగుతోంద‌ని, రాబోయే కాలంలోనూ ఇది ముందుకు సాగుతుంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాట్లాడుతూ, మే 19వ తేదీన తన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడిస్తానని తెలిపారు. ఎవరైతే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేస్తారో వారికే ప్రజలు పట్టం కడతారని రాజగోపాల్‌ తెలిపారు. తెలంగాణాలో తన సర్వే ఎందుకు విఫలమైనదో మే 19వ తేదీన వెల్లడిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ సంద‌ర్భంగా కోమ‌టి జ‌య‌రాం మాట్లాడుతూ, ముఖ్య‌మ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన అభివృద్ధి- సంక్షేమ కార్య‌క్ర‌మాలే తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించ‌నున్నాయ‌న్నారు. మ‌రోమారు తెలుగువారి కోసం ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ను చంద్ర‌బాబు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.