మీట్ అండ్ గ్రీట్ విత్ పోచారం... టాక్ ఈవెంట్ కు పోటెత్తిన ఎన్నారైలు

November 14, 2019

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ లో పర్యటిస్తున్నారు. పోచారం పర్యటనను పురస్కరించుకుని లండన్ లోని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్), ఎన్నారై టీఆర్ఎస్ సెల్ - యూకే సంయుక్తంగా నగరంలో మీట్ అండ్ గ్రీట్ విత్ " తెలంగాణా అసెంబ్లీ  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి వివిద సంస్థల ప్రతినిదులు, తెలంగాణా వాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో... ముందుగా అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళ్ళు అర్పించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్  గడచిన ఎనిమిదేళ్లలో చేపట్టిన ముఖ్య కార్యక్రమాలను పోచారానికి వీడియో ప్రదర్శనతో  వివరించారు. 

అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణా నిర్మాణ దిశ లో  టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు.  మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఆహార్నిశలు కష్టపడ్తున్నారని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని పేర్కొన్నారు. ప్రత్యేకించి తెలంగాణ రెవెన్యూ శాఖ ఎటువంటి అవినీతి లేకుండా పనిచోస్తోందంటూ సాక్షాత్తూ ప్రదాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రశంసించారని తెలిపారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో రైతులకు కలిగిన అభివృద్ధి గురించి ప్రవాసులకు వివరించారు. సమైక్య పాలనలో ఎన్నడూ జరగని సంక్షేమం నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరుగతోందని, ఈ క్రమంలో యావత్తు భారత దేశమంతా తెలంగాణవైపే చూస్తోందని ఆయన చెప్పారు. 

కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో ముందుండి నేడు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని పోచారం తెలిపారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌.. రైతుబంధు, రైతు బీమా ప‌థ‌కాలు చేప‌ట్టిన విష‌యం మనకు  తెలిసిందేనని, ఈ పథకాలు ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించాయని, ఐక్య‌రాజ్య‌స‌మితి ఈ రెండు ప‌థ‌కాల‌కు వినూత్న గుర్తింపు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఐరాసకు చెందిన ఫుడ్ అండ్ అగ్రిక‌ల్చ‌ర్ ఆర్గ‌నైజేష‌న్‌.. ఈ రెండు ప‌థ‌కాల‌ను స‌క్సెస్ ప‌థ‌కాలుగా గుర్తించడంతో పాటుగా రైతుల సంక్షేమం కోసం వ్య‌వ‌సాయ రంగంలో వ‌స్తున్న వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను గుర్తించిందని తెలిపారు. గతేడాది రోమ్‌లో నిర్వహించిన అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో వివిధ దేశాల్లో విజ‌య‌వంత‌మైన 20 వినూత్న వ్య‌వ‌సాయ ప‌థ‌కాల‌ను ఆ సంస్థ ప్ర‌జెంట్ చేస్తే.. వాటిలో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు, రైతు బీమా స్కీమ్‌లు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. మనం ఎంత మంచి పనులు చేసినా కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తూనే ఉంటాయని, కానీ తెలంగాన ఎంతో అభివృద్ధితో ముందుకు వెళ్తుందని చెప్పారు. తెలంగాణ సమాజం కలలు గన్న బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యమని కూడా పోచారం తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ వెంట ఉన్నారో... నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా  ఎన్నారైలు ముందుండి నడవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పోచారం పిలుపునిచ్చారు. రోజువారీగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఇంత చక్కటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన టాక్ మరియు ఎన్నారై తెరాస కార్యవర్గానికి, ఆలాగే హాజరైన యూకే ప్రవాస సంఘాల ప్రతినిధులకు పోచారం కృతఙతలు తెలిపారు. 

అనంతరం టాక్ మరియు ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... ఎంతో బిజీగా ఉన్నపటికీ  సమయం ఇచ్చి కార్యక్రామానికి వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు, ఎన్నారై టీఆర్ఎస్ సెల్ కు ఎప్పటికప్పుడు సీెం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ వెంటే ఉంటామని తెలిపారు. పోచారం రాజకీయ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని, అంచెలంచలుగా ఎదిగి, రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదురుకొని నేడు రాజ్యాంగ అత్యుత్తమ స్థానాన్ని చేరుకున్న వారి జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు  పోచారం తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలను, నేడు స్పీకర్ గా రాష్ట్ర అసెంబ్లీని నడుపుతున్న తీరును ఆయన సభకు వివరించారు. పోచారం ఎల్లవేళలా ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడని, ఎంటువంటి సమస్యతో వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తాడనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించిన గొప్ప నాయకుడని కీర్తించారు. 

ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ... కేసీఆర్ చేత "లక్షి పుత్రుడు"  అని పిలుపించుకొనే మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నేడు లండన్ లో తమ మధ్య ఉండడం చాలా సంతషంగా ఉందన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన పోచారం... తాను చేపట్టిన బాధ్యతలన్నింటిలో తనదైన ముద్ర వేసుకొని, రాష్త్ర ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప నాయకుడని కీర్తించారు. పోచారం తనయుడు పోచారం సురేందర్ రెడ్డి లండన్ లో తమతో ఎన్నో ఉద్యమాలు చేశారని, ఒక సామాన్య కార్యకర్తలాగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి లండన్ వీధుల్లో జై తెలంగాణ అంటూ గులాబీ జెండా పట్టుకొని రాష్ట్ర సాధనోద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి, హాజరైన ప్రవాసులందరికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

తదనంతరం టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ... ఉద్యమ సమయం లో పదవులకు ప్రాధాన్యతనివ్వకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తో కలిసి చేసిన పోరాటం పోచారం సుదీర్ఘ రాజకీయ జీవితంలో గొప్ప మైలు రాయిగా మిగిలిపోతుందని తెలిపారు. ప్రజల పట్ల, రైతుల పట్ల పోచారానికి ఉన్న బాధ్యత స్థానికంగా తాము బాన్సువాడ వెళ్ళినప్పుడు చూశామని, వ్యక్తిగతంగా తమకు బాన్సువాడ తో ప్రత్యేక అనుభందం ఉందని తెలిపారు. పోచారంతో పాటు ఆయన సతీమణి కూడా తమతో ఇంత ఓపికగా ఈ సమవేశానికి హాజరైనందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నారై తెరాస యూకే అడ్వైసరి బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ... పోచారం ఎంతటి నిరాడంబరుడో అంతటి కార్యదక్షుడని, గత ఎన్నికల్లో బాన్సువాడ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ విషయం తమ కళ్లకు కట్టిందన్నారు. ఫిదా సినిమాలో చూపించినట్టు బాన్సువాడను ఎక్కడ చూసిన పచ్చదనం నింపేశారని, ప్రజల్లో పోచారానికి ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని పొగిడారు. పోచారం సేవలు కేవలం బాన్సువాడకు పరిమితం చేయకుండా, కేసీఆర్ 2014 లో పోచారానికి వ్యవసాయ మంత్రిగా, నేడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు ఇవ్వడం తమకందరికి ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. 

కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థల కార్యవర్గ సబ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి  దంపతులను ఘనంగా  సన్మానించి ప్రత్యేక జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమానికి హాజరైన  స్పీకర్ సిబ్బంది, అసెంబ్లీ  కార్యదర్శి నర్సింహాచారి, ఓస్ డీ మోహన్ రెడ్డి, అదనపు వ్యక్తిగత కార్యదర్శి రఘులకు టాక్ సంస్థ  జ్ఞాపికను అందించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన అతిథులను పోచారం వ్యక్తిగతంగా కలవడంతో పాటు వారితో కలిసి సందడి చేశారు. వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో  టాక్ మరియు ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపకులు  అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది,  ఎన్నారై తెరాస యూకే  అధ్యక్షుడు అశోక్  గౌడ్ దూసారి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్ది రాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, ఎన్నారై తెరాస యూకే అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, టాక్ ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, టాక్ & ఎన్నారై తెరాస కార్యవర్గ సభ్యులు మట్టా రెడ్డి, మల్లా రెడ్డి, సత్య చిలుముల,  సృజన్ రెడ్డి చాడ, రమేష్ ఇస్సంపల్లి,  శ్రీకాంత్ జెల్ల, సురేష్ బుడగం, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, సత్యపాల్  పింగిళి, రాకేష్ పటేల్, రవి రేతినేని, ప్రవీణ్ వీర,  శుషుమ్నా రెడ్డి, క్రాంతి, జాహ్నవి, వంశీ పొన్నం, విజితా రెడ్డి , శైలజ, శ్వేతా మహేందర్,  జస్వంత్ , సురేష్ గోపతి, ప్రశాంత్, గణేష్ పేస్తాం, అపర్ణ, స్వప్న, సుప్రజ పులుసు, అద్బుల్ జాఫర్, రామ్ కలకుంట్ల, అశోక్ అంతగిరి, రవి కిరణ్,  వెంకీ, సత్య జిల్లా, నవీ  భార్గవ్ కలకోటి  మరియు తాల్ కార్యవర్గ సభ్యులు,  ప్రతినిదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.