NRI : ఏప్రిల్ లో ఎన్నారైలు అంత డబ్బు పంపించారట

August 13, 2020

అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు సున్నాకి పడిపోవడంతో ఎన్నారైల నుంచి నిధులు ఇండియాకు పోటెత్తాయి. కరోనా ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు ఏప్రిల్‌లో 95 1.95 బిలియన్లను ఇంటికి పంపారు.

గత 26 నెలల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తమ డబ్బు విలువ పడిపోకుండా గ్లోబల్ ఇండియన్స్ తమ సంపదను  ఇలా ఇండియాకు తరలించే ప్రయత్నం చేశారు. ఇది ఫారెక్స్ నిల్వలను మన దేశంలో పెంచడమే కాకుండా, క్యాష్ ఫ్లో (నగదు సరఫరాను) కూడా పెంచనుంది. వాస్తవానికి ఇది మొత్తానికి ఇంటికి పంపినట్టు కాదు.. ఎక్కువ నిల్వలు భారతీయ బ్యాంకులకు పోగుపడ్డాయి.

అమెరికా లేదా ఇతర దేశపు బ్యాంకుల్లో దాచుకున్న  తమ డబ్బును ఎన్నారైలు భారతీయ బ్యాంకుల్లో ఉంచడానికి వారికి మన బ్యాంకుల్లో కొన్ని సౌలభ్యాలు ఉండటం కూడా కారణం కావచ్చు. అంతేగాకుండా ఏప్రిల్ లో రూపాయి బాగా బలహీనపడింది. 76 రూపాయలు ఒక డాలరుకు పడిపోయింది. ఇది కూడా డిపాజిట్ల వరదకు కారణం. మన బ్యాంకుల్లో వారి సొమ్ము విలువ తగ్గే రిస్కు కూడా బాగా తక్కువ. ఈ అక్కౌంట్లలో నగదు నిల్వలు... స్థానికంగా వాడుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.