​ఏపీ​ బాధ ఇప్పటికైనా అర్థమైందా రాంమాధవ్ ?

August 06, 2020

ప్రతి ఒక్కరికీ ఒక టైం వస్తుంది. అంతకుముందు చవిచూసిన చీకటి రోజులు మరిచిపోయి ఇక భవిష్యత్తు అంతా నాదే అనుకుని గర్వపడితే.. మళ్లీ సూర్యాస్తమయం, మళ్లీ చీకట్లూ తప్పవు. ఈ చిన్న లాజిక్ బీజేపీ మరిచిపోయి... చేస్తున్న రాజకీయాలు ఈరోజు కాకపోయినా రేపయినా దేశాన్ని ఏకంగా చేస్తాయి. దానికి ఒక కొత్త నాయకత్వం రావచ్చు. చెప్పలేం. ఏపీ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ వాడికి కూడా బాధ కల్గించేంత ఘోరంగా ఉంది. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయానికి చంద్రబాబు, జగన్ లే బీజేపీలో చేరినా ఏపీ ప్రజలు క్షమించే స్థితిలో లేరు. అనుక్షణం ఆంధ్రను అనాథగా వదిలేస్తూ, అవమానిస్తూ, నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ ఆ రాష్ట్రంలో ఎలా ఎదుగుదాం అనుకుంటుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే ఏపీ వాళ్లు అన్నీ మరిచిపోతారు అలాగే బీజేపీ చేసిన మోసాలు కూడా మరిచిపోతారు అని భ్రమపడుతున్న బీజేపీకి తానా వేదికగా గట్టి దెబ్బ తగిలింది. ఎన్నారై వేదిక నుంచి తెలుగు రాజకీయాలను నరుక్కువద్దామని ప్రత్యేక ఆహ్వానంతో వెళ్లిన రాంమాధవ్ తీవ్ర అవమాన భారంతో తానా వేదిక దిగాల్సి వచ్చింది. అదేంటి పిలిచి అవమానిస్తారా అనొచ్చు. అది ఒకరిద్దరి సమావేశం కాదు... వేలాది తెలుగు వాళ్ల సమావేశం. ప్రతి తెలుగు వాడిలోగూడుకట్టుకుని ఉన్న బాధ ఒక్కసారిగా అందరి గొంతులో ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనికి వేదిక మీద నుంచి రాంమాధవ్ అడుగులు కిందకు పరుగుతీసే పరిస్థితి. అయినా బీజేపీ ఏపీకి చేసిన మోసము, అవమానంతో పోలిస్తే ఇదెంత. కొన్ని సార్లు బీజేపీ అనుకోవచ్చు ‘‘మేము ఇబ్బంది పెట్టింది చంద్రబాబును కదా, తెలుగు వారెందుకు ఫీలవుతున్నారు ?’’ అని. చంద్రబాబు ను ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర అభివృద్ధిపై ఉక్కుపాదం మోపిన విషయం ఏపీ పౌరులకు తెలియదా? అంతెందుకు.... నిన్నటికి నిన్న ఏపీకి బడ్జెట్లో ఎంత మోసం జరిగిందో తెలియదా? పేపరు చదివే తెలుగు వచ్చిన చిన్న పిల్లాడికి కూడా తెలుసు. ఏపీలో ప్రజలకు బీజేపీ మీద కోపం కాదు మంట ఉంటుంది.
పైగా రాజకీయాలు తప్ప ఏపీ ప్రాణం పోయినా మాకేం సంబంధం అన్నట్లు వ్యవహరించే రాంమాధవ్ వంటి వారిని చూసి తెలుగు వారికి ఇంకా గట్టిగా మండింది. ఎవడో ఉత్తరాది బీజేపీ వాడు మనల్ని మోసం చేశాడంటే.. ఏదో అనుకోవచ్చు, ఏపీ కన్నబిడ్డలై ఉండి... కేవలం పార్టీ కోసం జన్మభూమికి అన్యాయం చేసే రాంమాధవ్ వంటి వారిపై మోడీ మీద కంటే ఎక్కువ కోపం ఉంటుంది ఏపీ ప్రజలకు ! అది ఏ స్థాయిలో ఉంటుందో నిన్న తానా వేదికపై ప్రతిబింబించింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. .ఎన్నారైలు కూడా బీజేపీకి వ్య‌తిరేకంగా డిజిట‌ల్ ప్ర‌చారం గట్టిగా చేశారు. ఇదంతా తెలిసి కూడా రాం మాధ‌వ్ పిలిచిన వెంటనే పోలోమంటూ తానా స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఏపీని మోసం చేసిందే కాకుండా ఈ వేదిక ద్వారా రాజకీయం చేద్దామనుకున్న రాంమాధవ్ కు ఎన్నారైలు గట్టిగా బుద్ధి చెప్పారు. రాంమాధవ్‌ మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి ఎన్నారైలు అడ్డుపడ్డారు. అనూహ్య ప‌రిణామంతో షాక్ తిన్న రాం.. ఎన్నారైలు కేకలు వేస్తున్నా ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే, కొందరు బీజేపీని, మోడీని తిడుతూ కేకలు వేయడంతో ఇక కొంతసేపు ఉంటే కొడతారేమో అని భావించిన రాంమాధవ్ నొసలు చిట్లించుకుంటూ ప్రసంగాన్ని ఆపేశారు. ఆ క్షణంలో రాంమాధవ్ మొహంలో నెత్తురు చుక్క కూడా లేదు.