అమరావతికి మరోసారి జైకొట్టిన ఎన్నారైలు

August 10, 2020

అమరావతికి ప్రజలందరి మద్దతు ఒకవైపు... జగన్ మొండి నిర్ణయాలు ఒకవైపు. దారితప్పుతున్న పరిపాలన, గాడితప్పుతున్న ఆదాయం.. వీటన్నింటి నేపథ్యంలో సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఏపీ ఖజానాపై భారం పెంచడానికి, సగానికి పైగా ప్రజలకు రాజధాని దూరం చేయడానికే జగన్ అమరావతి రాజధానిని తరలిస్తున్నారు. అయితే... జగన్ కు ఆయన పార్టీ నుంచి తప్ప బయట ఎక్కడ మద్దతు దొరకడం లేదు. రాష్ట్రమంతటా తననే గెలిపించారు కాబట్టి... అమరావతి మార్పు సులువు అవుతుందని జగన్ అనుకున్నారు. దానికి విరుద్ధంగా ప్రజలందరి మద్దతు అమరావతికే ఉంది. వైజాగ్ కు రాజధాని తీసుకెళ్లడం అసలు వైజాగ్ వాళ్లకే ఇష్టం లేకపోవడం విచిత్రం.

ఇక ఎన్నారైలు ఎవరూ కూడా వైజాగ్ ను సమర్థించడం లేదు. అమరావతి అనుకూలమైన ప్రదేశమని... అటు ఏపీకి, ఇటు ఇప్పటికే ఆంధ్రులు అత్యధికంగా స్థిరపడిన హైదరాబాదుకు అన్నిటికి సమాన దూరంలో ఉన్న అమరావతి రాజధానిగా ఉత్తమం అని ఎన్నారైలు కూడా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఎన్నారైలు తమ ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో మొన్న సీనియర్ తెలుగు ఎన్నారై జయరాం ఆధర్వ్యంలో కాన్సులేట్ జనరల్ అమరావతిపై మొమెరాండం సమర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ కు న్యూజెర్సీ న్యూయార్క్ లోని ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ఎన్నారైలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగాలని మెమోరాండం సమర్పించారు.