ఎన్నారై టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ అరెస్టు

August 03, 2020

రోజురోజకు ఉదృతం అవుతున్న అమరావతి ఆందోళనలో ప్రజల భాగస్వామ్యం మెల్లగా పెరుగుతోంది. మొదట భూములు ఇచ్చిన రైతులతో మొదలైన ఈ ఉద్యమం... మెల్లగా పరిసర జిల్లాలకు విస్తరించింది. ఆ తర్వాత రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా వైజాగ్ కు రాజధాని ఇస్తామని జగన్ చెప్పినా... ఆ వైజాగ్ ప్రజలు కూడా అమరావతికే మద్దతు పలకడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. ఒక రాష్ట్రంలోనే కాదు... ప్రముఖ ఎన్నారైలు జన్మభూమి కోసం తమ పనులు మానుకుని వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారు. వారిలో ఒకరు బుచ్చి రాంప్రసాద్.

ఎన్నారై టీడీపీ నేతగా చాలాకాలం నుంచి ప్రజాసేవలో ఉన్న బుచ్చి రాంప్రసాద్ జన్మభూమి కోసం అమరావతి పోరాటంలో పాల్గొంటున్నారు. అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచే దానికి సంపర్ణ మద్దతు పలికిన బుచ్చి రాంప్రసాద్ ఇటీవల ఉద్యమానికి విరాళం కూడా ఇచ్చారు. విరాళం ఇచ్చి చేతులు దులుపుకోకుండా ప్రతిరోజు నిరసనల్లో నిర్విరామంగా పాల్గొంటున్నారు. ఈరోజు ఉద్యమంలో భాగంగా నిరసన తెలుపుతున్న ఆయనను మరికొందరు తెలుగుదేశం కార్యకర్తలను, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ సందర్భంగా బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ... అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోతే... ఈ ప్రపంచంలో స్వేచ్ఛకు తావే ఉండేది కాదని... ఎంత అణచాలని చూస్తే అంత తీవ్రంగా పోరాడుతాం అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.