వీడియో అదిరింది రాజమౌళి !!

August 06, 2020

కరోనాతో ఇంట్లో ఉండిపోయిన వారికి రాజమౌళి వరుసగా రెండు RRR ట్రీట్స్ ఇచ్చాడు. మొన్న టైటిల్, టైటిల్ లోగో రిలీజ్ చేసి అబ్బుర పరిచిన రాజమౌళి తాజాగా అల్లూరు సీతారామరాజుని అందరికీ పరిచయం చేశారు. దీనికి ఎన్టీఆర్ వాయిస్ చెప్పడం విశేషం. అయితే, ఈసినిమాకు వేర్వేరు భాషలకు వేర్వేరు పేరు పెట్టడం విచిత్రం. కానీ టైటిల్ లోగో వీడియో విడుదల అయ్యాక ఒక విషయం అర్థమైంది. అసలు ఆ సినిమా టైటిల్ RRR మినహా మరేం కాదు. జనం అలాగే పలుకుతారు. చివరకు దానికి ఎన్ని అబ్రివియేన్లు చెప్పినా టైటిల్ RRR మాత్రమే. 

ఇక ఈరోజు ఎన్టీఆర్ వాయిస్ తో విడుదల చేసిన వీడియోలో క్లిప్స్ అన్నీ ప్రైవేట్ వి, వర్కింగ్ స్టిల్స్ మాత్రమే. ఇవేవీ మెయిన్ సినిమాలో ఉండబోవు. "ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే చావుకైనా చెమటలు ధారకడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న... మన్నెం దొర... అల్లూరి సీతారామరాజు" అంటూ ఎన్టీఆర్ అల్లూరిని పరిచయం చేశారు. ఈ వీడియో ద్వారా రాంచరణ్ RRR కోసం చాలా వర్కవుట్స్ చేసినట్టు అర్థమవుతుంది. 

అయితే ఈ వీడియో వ్యవహారం నిన్నటి నుంచి ట్విట్టరులో ఫన్ క్రియేట్ చేస్తోంది. రేపు గిఫ్ట్ ఇస్తా బ్రదర్ అని చెప్పిన ఎన్టీఆర్... ఈరోజు ఉదయం.. అయ్యో అది రాజమౌళి వద్దకు చేరిందని ట్వీట్ చేశాడు. ఏంటి అలా చేశావా? అసలు ఈరోజు ఇస్తావా? లేదా ? అని కసిరాడు రాంచరణ్. మధ్యలో చిరంజీవి చాలా డిజప్పాయింట్ చేశారు అంటూ సెటైర్ వేశాడు. ఇంతలో ఇదిగో నీ గిఫ్ట్ అంటూ ఈ వీడియో పోస్టు చేశాడు ఎన్టీఆర్.