ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై జేసీ సంచలన వ్యాఖ్యలు

May 29, 2020

నిర్మొహమాటంగా నచ్చినట్టు మాట్లాడే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఏ పార్టీ మీద ఆసక్తి చూపడం లేదు. అమిత్ షాను కలవలేదు. నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను అని స్పష్టం చేశారు. టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇక ముందు కూడా చంద్రబాబే దిక్కని, ఆయన తప్ప మరో నాయకత్వం లేదని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటున్నారు.. సినిమా వాళ్లను జనాలు రాజకీయ నాయకులుగా ఆమోదించడం లేదన్నారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమో చెప్పలేం అన్నారు.  "పవన్ కల్యాణ్ టాప్ హీరోనే కదా. ఆయన వచ్చినపుడు మీకు రాజకీయాలు వేస్ట్ అని నేరుగా అతనికే చెప్పాను. రాజకీయాలు సరిపడవని చెప్పాను. పవన్ పై క్రేజుతో జనం వస్తారే తప్ప వారంతా మీ వెంట నడిచేవాళ్లు కాదని చెప్పాను’’ అదే జరిగిందని జేసీ వ్యాఖ్యానించారు. చిరంజీవి, రోజా, విజయశాంతి కూడా వచ్చారు. వాళ్లని పూర్తి స్థాయి రాజకీయ నాయకులుగా ఆమోదించడం చాలా కష్టం అన్నారు.  

అంటే జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే... ఎన్టీఆర్ పదేళ్ల తర్వాత రాజకీయ నాయకుడిగా బలపడాలంటే.... ఇపుడే పార్టీలో చేరి చంద్రబాబు నేతృత్వంలో పనిచేయాలి, లేకపోతే అతనికి పెద్ద రాజకీయ భవిష్యత్తు ఏం ఉండదన్నట్లు మాట్లాడారు జేసీ. ఆయన వ్యాఖ్యలను విశ్లేషిస్తే మనకు అర్థమయ్యేది ఇదే. అసలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్టీఆర్ ను అప్పటికపుడు ఆమోదించడం కష్టమన్నట్టు అభిప్రాయపడ్డారు జేసీ.