డల్లాస్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

August 12, 2020

నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతిని ఎన్నారై టీడీపీ డల్లాస్ లో ఘనంగా జరిపింది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి ఎదిగిన ఆ మహనీయుడి జయంతి తెలుగు ప్రజలు తమ ఆత్మీయ కలయికలో ఘనంగా స్మరించుకుంటూ జరుపుకున్నారు. ఎన్టీఆర్ సాధారణ రైతు కుటుంబంలో మే 28, 1923న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. పెళ్లైన తరవాత బి.ఎ. పూర్తిచేసి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. అనంతరం ఉద్యోగంలో ఇమడలేక, సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లి పట్టుదలతో కృషి చేసి దాదాపు ౩౩ సంవత్సరాలు తిరుగులేని కథా నాయకుడిగా సినీ ప్రయాణాన్ని సాగించారు. తెలుగు వారికి రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.
సినీ జీవితంలో నుంచి రాజకీయ జీవితంలో అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్. పేద బడుగు బలహీన వర్గాల వారు పడుతున్న కష్టాలకు చెలించి పోయి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదలకు 2 రూపాయలకే కిలోబియ్యం, 50 రూపాయలకే విద్యుత్, పటేల్ పట్వారి వ్యవస్థల రద్దు, మహిళలకు ఆస్తిలో సమన హక్కు, మహిళా రిజెర్వేషన్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదల అభ్యున్నతికి పాటుపడ్డారు. భౌతికంగా అన్న ఎన్టీఆర్ మనమధ్య లేకున్నా తెలుగు ప్రజలందరి హృదయాల్లో ఎప్పటికి శాశ్వత స్థానాన్ని సంపాదించుకొన్నారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక పట్టుదలకు, కృషికి, విజయానికి, అభివృద్ధికి పర్యాయ పదాలుగా వున్నాయి. పిల్లలకు ఎన్టీఆర్ జీవితాన్ని ఆదర్శం గా చూపించి వాళ్ళను మంచి పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు, బాలకృష్ణ అభిమానులు ఎన్నారై టిడిపి డల్లాస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.