‘యన్.టి.ఆర్.. మహానాయకుడు’ మూవీ రివ్యూ

May 25, 2020

నిర్మాణ సంస్థ‌లు: ఎన్‌.బి.కె.ఫిలింస్ , వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి

స‌మ‌ర్ప‌ణ‌: సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి

నటీనటులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, సమీర్, సచిన్ కేడ్కర్, భరత్ రెడ్డి, వెన్నెల కిశోర్ తదితరులు.

సంగీతం: ఎంఎం కీర‌వాణి

సినిమాటోగ్రఫీ: వీఎస్‌ జ‌్ఞాన‌శేఖ‌ర్

డైలాగ్స్: సాయిమాధ‌వ్ బుర్రా

సాంగ్స్: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి

ఆర్ట్‌: సాహి సురేష్‌

కో ప్రొడ్యూసర్‌: ఎంఆర్వీ ప్ర‌సాద్‌

ప్రొడ్యూసర్స్: న‌ంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నందమూరి బాల‌కృష్ణ‌

స్టోరీ, డైరెక్షన్: జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

 

దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘యన్.టి.ఆర్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ ప్రేక్షుకులను మెప్పించినా కలెక్షన్లు రాబట్టుకోవడంలో అంతగా సక్సెస్ కాలేదు. అయితే, అందులో బాలయ్య నటన.. క్లైమాక్స్.. రెండో భాగం ‘యన్.టి.ఆర్.. మహానాయకుడు’పై ఆసక్తిని రేకెత్తించాయి. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన సినిమా కావడంతో పాటు, ఇటీవల విడుదలైన ట్రైలర్ దీనిపై అంచనాలు పెంచేసింది. మరి ‘మహానాయకుడు’ ఆ అంచనాలను అందుకున్నాడా..? ఈ సినిమాతో భారీ కలెక్షన్లు అందుకోబోతున్నాడా..? 

 

కథ

కథగా చెప్పుకోడానికి ఇది ఎవరికీ తెలియనిది కాదు. అయితే, ఆంధ్రుల అభిమాన నటుడు రాజకీయాల్లోకి ఎలా ప్రవేసించాడు.. తెలుగుదేశం పార్టీని స్థాపించడం వెనుక కారణాలు ఏంటి..? పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి ఎలా రాగలిగారు..? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి..? వాటిని అధిగమించిన తీరు ఎలా ఉంది..? నాదెండ్ల భాస్కర్‌రావు.. ఎన్టీఆర్‌కు ఎలా.. ఎందుకు వెన్నుపోటు పొడిచారు..? ఆ తర్వాత రామారావు మళ్లీ ముఖ్యమంత్రి అవడానికి ఏం చేశారు..? అనే అంశాలపై తెరకెక్కిన సినిమానే ఇది.

 

ఎలా ఉందంటే

పక్కాగా ఇది నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తల కోసం తీసిన సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. అందరూ అనుకున్నట్లుగానే చిత్ర దర్శకుడు క్రిష్ దీన్ని వాళ్ల కోసమే తెరకెక్కించాడు. ఎన్టీఆర్ రాజకీయం జీవితంతో పాటు కుటుంబ విలువలతో కూడిన సినిమా ఇది. పాలిటిక్స్‌ను భావోద్వేగంతో ముడిపెట్టడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎదుర్కొన్న సవాళ్లతో పాటు భార్య బసవతారకమ్మ కోసం కృంగిపోయిన విధానం బాగా చూపించారు. ఈ రెండింటి మేళవింపుతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫైనల్‌గా సినిమాను సినిమాగా చూసేవాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. 

 

నటీనటుల పనితీరు

ఈ సినిమాకు అన్నీ తానై నిలిచారు నందమూరి బాలకృష్ణ. ‘కథానాయకుడు’లో యంగ్ ఎన్టీఆర్ పాత్రకు ఆయన అంతగా సెట్ కాలేదు అనిపించింది. అయితే, ఈ భాగంలో మాత్రం ఆయన సరిపోయారు. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌లానే కనిపించారు. ఈ సినిమాలో బాలయ్య నటించారు అనడం కంటే జీవించారు అనవచ్చు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర విద్యాబాలన్‌దే. బసవ తారకమ్మ పాత్రలో ఆమె ఒదిగిపోయారు. భావోద్వేగా సన్నివేశాల్లో బాలయ్యతో పోటీ పడి మరీ నటించారు. అలాగే, చంద్రబాబు పాత్రను చేసిన రానా కూడా ఆకట్టుకున్నాడు. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ పట్టడంతో అతడు సక్సెస్ అయినట్లే అనిపించాడు. నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో కనిపించిన సచిన్ కేడ్కర్ సహా మిగిలిన నటులు కూడా తమ పాత్రల పరిధి మేర నటించారు.

 

టెక్నీషియన్ల పనితీరు

ముందుగా ఈ సినిమాకు పిల్లర్‌గా నిలిచిన దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడుకోవాలి. ఒక గొప్ప వ్యక్తి బయోపిక్ తెరకెక్కించేటప్పుడు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో క్రిష్ ఆచితూచి వ్యవహరించాడు. సున్నితమైన అంశాలను పైపైన తాకుతూ.. మిగిలిన వాటిలో సత్తా చాటాడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్‌ను, కుటుంబ విలువలను చక్కగా చూపించాడు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి కూడా మెప్పించారు. తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్‌ చేశారు. మాటల రచయితగా సాయి మాధమ్‌ బుర్రా మరోసారి తన కలానికి పదును పెట్టారు. కొన్ని డైలాగులు బుల్లెట్లులా పేలాయి. వీఎస్‌ జ‌్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. అలాగే మిగిలిన విభాగాలు కూడా చక్కగా కుదిరాయి.

 

బలాలు

* బాలయ్య, విద్యా బాలన్ నటన

* భావోద్వేగ సన్నివేశాలు

* డైలాగులు

* పొలిటికల్ డ్రామా

* నేపథ్య సంగీత

 

బలహీనతలు

* సెకెండాఫ్‌లో సాగదీత

* కథకు అంతం లేకపోవడం

 

మొత్తంగా: ‘మహానాయకుడు’ మెప్పించాడు

 

రేటింగ్: 3.25/5