ఎన్టీఆర్ ట్రస్ట్... సైలెంటుగా చాలా చేసిందే !!

June 06, 2020

ప్రాణంతక వైరస్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆపదలో ఉన్న వారికి సాయం వెల్లువెత్తుతోంది. ఈ సాయం చేస్తున్న వారిలో కొొందరు డబ్బా కొట్టుకుంటూ ఉంటే.. మరికొందరేమో అసలు సాయం చేస్తున్నామన్న మాటను ఎక్కడా చెప్పుకోకుండానే సైలెంట్ గానే చేసేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖులై ఉండి.. కీలక స్థానంలో ఉన్న వారు ఏం సాయం చేస్తున్నారంటూ వైరి వర్గాలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ తరహా విమర్శలు ఓ రేంజిలో ఉంటున్నాయి. ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండానే చాలా మంది ప్రముఖులు... ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండానే సాయం చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది టీడీపీ ఆధ్వర్యంలో నడిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం. 

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటిదాకా ఏ పాటి సాయం చేసిందన్న విషయాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం వెల్లడించారు. కరోనా సంక్షోభమే కాకుండా ఏ సంక్షోభం ఎదురైనా తెలుగు ప్రజలకు అండగా నిలిచేందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన భువనేశ్వరి... కరోనా ఆంక్షల నేపథ్యంలో భౌతిక దూరానికి ఎలాంటి ఆటంకం లేకుండానే ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో 20 వేల మంది పేదలకు నిత్యావసరాలైన బియ్యం, నూనె, పండ్లు, గుడ్లు, కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు.
అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.5 లక్షల మందికి ఎస్ఎస్-99 మాస్కులు అందించామని కూడా భువనేశ్వరి చెప్పారు. 3 వేల మంది కూలీలకు పులిహోర, బిస్కెట్లు పంపిణీ చేశామని, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కూడా ఆమె తెలిపారు. వీటన్నింటికంటే కూడా ప్రధానమైన రక్త నిధి సేవలను కూడా కొనసాగిస్తున్నామని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు 24 గంటల పాటు అత్యవసర సేవలు అందిస్తోందని, వైజాగ్, హైదరాబాద్, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా ఇప్పటిదాకా 5 వేల యూనిట్ల రక్తాన్ని పంపిణీ చేశామని కూడా భువనేశ్వరి తెలిపారు.