జగన్ కు షాక్... పోలవరంపై పిడుగు

May 24, 2020

ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంత వీజీ కాదనే చెప్పక తప్పదు. ఏపీ రూపురేఖలే మార్చేయనున్న ప్రాజెక్టుగా పేరొందిన పోలవరాన్ని ఎక్కడికక్కడ నిలిపివేసే దిశగా పొరుగు రాష్ట్రం ఒడిశా చేస్తున్న ప్రయత్నాలను గత చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించింది. ఒడిశా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు పదే పదే ఫిర్యాదులు చేసినా... వాటిని చంద్రబాబు సర్కారు ఎప్పటికప్పుడు నిరోధిస్తూనే సాగింది. అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సర్కారు లేదు కదా. పాలనలో అంతంతమాత్రమే అనుభవమున్న జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక... పోలవరం పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. 

ఇదే అదనుగా ఇప్పుడు ఒడిశా... ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోలవరం ప్రాజెక్టు పనులను ఆపాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్ పై విధించిన స్టేను ఎత్తివేయాలని ఒడిశా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తన వాదనను సుప్రీంకోర్టుకు బలంగా వినిపించేందుకు సవివరంగా వరద ముప్పును ప్రస్తావించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే... దాని వల్ల వచ్చే వరదతో ఒడిశాలో ఏకంగా 200 అడుగులకు పైగా ముంపు వచ్చే ప్రమాదముందని కూడా ఒడిశా సుప్రీంకు తెలిపింది. 200 అడుగుల మేర ముంపు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అదే జరిగితే... ఒడిశా దాదాపుగా మునిగిపోయినట్టేనని చెప్పక తప్పదు. అంటే.. పోలవరాన్ని ఏపీ పూర్తి చేస్తే.. తమ రాష్ట్రం పూర్తిగా మునిగిపోయినట్టేనన్నది ఒడిశా వాదన.

అయితే పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాలో ముప్పు ఎంతన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేకున్నా... ఒడిశా తన వాదనను బలంగా వినిపిస్తే... పోలవరానికి సుప్రీంకోర్టు బ్రేకులేయడం ఖాయమే. ఇదే జరిగితే... ఏపీకి జీవనాడి అయిన పోలవరం దాదాపుగా నిలిచిపోవడం గ్యారెంటీనే. మరి ఈ ముప్పు నుంచి పోలవరాన్ని జగన్ సర్కారు ఎలా కాపాడుతుందనేది ఇప్పుడు అందరినోటా వినిపిస్తున్న ప్రశ్న. అసలే పనులు అంతంతమాత్రంగానే సాగుతుండటం, ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేంద్రం నుంచే రావాాల్సి ఉండటం, కేంద్రం నిధులిస్తేనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని జగన్ సర్కారు చెబుతుండటం.. తదితర పరిణామాలన్నీ చూస్తే... ఒడిశాను నిలువరించే పనిని జగన్ సర్కారు ఏ మేరకు ముందుకు తీసుకెళుతుందన్నది ప్రశ్నార్థకమే.